సాధారణంగా కొంతమంది కంపెనీ అధినేతలు, తమ ఉద్యోగులకు దీపావళి లేదా దసరా సందర్భంగా గిఫ్ట్స్ లేదా బోనస్ వంటివి అందిస్తుంటారు. అయితే ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త మాత్రం 'మదర్స్ డే' సందర్భంగా ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
ఉద్యోగులు తమ తల్లిదండ్రులతో సమయం గడపడానికి మూడు రోజులు సెలవు ఇవ్వడంతో పాటు.. రూ.10వేలు నగదు కూడా ఇవ్వనున్నట్లు పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ఎలైట్ మార్క్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజత్ గ్రోవర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏమీ ఆశించకుండా.. మనకోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వారికి ఉన్న చిన్న చిన్న కోరికలను తీర్చే సమయం వచ్చేసింది. వాటిని తప్పకుండా నెరవేర్చండి. తల్లిదండ్రులు ఎన్నాళ్లు మనతో ఉంటారో తెలియదు. కాబట్టి సమయం దొరికినప్పుడు వారితో గడపడానికి సమయం కేటాయించడానికి ప్రయత్నించండి అని రజత్ గ్రోవర్ పేర్కొన్నారు.


