సంవత్ 2076కు లాభాల వీడ్కోలు

Market ends in positive zone on last day of Samvat 2076 - Sakshi

86 పాయింట్లు పెరిగి 43,443 వద్ద నిలిచిన సెన్సెక్స్‌

29 పాయింట్లు పుంజుకుని 12,720 వద్ద ముగిసిన నిఫ్టీ

ఈ వారం మధ్యలో మార్కెట్ల చరిత్రాత్మక గరిష్టాల రికార్డ్స్‌

బుధవారం వరకూ 8 సెషన్లలో 10 శాతం ఎగసిన సెన్సెక్స్

‌ దివాలీ సందర్భంగా శనివారం 6.15-7.15 మధ్య ముహూరత్‌ ట్రేడింగ్‌

ముంబై: సంవత్‌ 2076కు స్టాక్‌ మార్కెట్లు లాభాలతో వీడ్కోలు పలికాయి. కొత్త ఏడాది 2077కు శనివారం వేదిక కానుంది. దీపావళి పండుగ సందర్భంగా 14న సాయంత్రం 6.15-7.15 మధ్య గంటపాటు ముహూరత్ ట్రేడింగ్‌కు తెరతీయనున్నారు. ప్రతీ ఏడాది సాయంత్రం మూరత్‌ ట్రేడింగ్‌ను చేపట్టడం స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఆనవాయితీగా పాటించే సంగతి తెలిసిందే. కాగా.. ముందురోజు 8 రోజుల సూపర్‌ ర్యాలీకి బ్రేక్‌ పడినప్పటికీ తిరిగి నేటి ట్రేడింగ్‌లో మార్కెట్లు లాభపడ్డాయి. అయితే రోజంతా ఒడిదొడుకుల మధ్య ట్రేడింగ్‌ నడిచింది. చివరికి సెన్సెక్స్‌ 86 పాయింట్ల వృద్ధితో 43,443 వద్ద ముగిసింది. నిఫ్టీ 29 పాయింట్లు బలపడి 12,720 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 43,522 ఎగువన గరిష్టాన్ని తాకగా.. 43,053 వద్ద కనిష్టాన్ని చేరింది. నిఫ్టీ సైతం 12,736- 12,608 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చదవండి: (ఫ‍్యూచర్‌ గ్రూప్ ఫ్యూచర్‌‌.. కత్తిమీద సాము!)

మీడియా డీలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, రియల్టీ, ఫార్మా, బ్యాంకింగ్‌ 1.7-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. మీడియా 1 శాతం డీలా పడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్ 7.5 శాతం జంప్‌చేయగా.. బజాజ్‌ ఫిన్‌, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, దివీస్‌ ల్యాబ్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గ్రాసిమ్‌ 4-2 శాతం మధ్య ఎగశాయి. అయితే టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌, ఐవోసీ, ఎస్‌బీఐ లైఫ్‌, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం 3.3-0.6 శాతం మధ్య క్షీణించాయి. చదవండి: (సిరామిక్‌ టైల్స్‌ షేర్లు గెలాప్‌)

అపోలో హాస్పిటల్స్‌ జోరు
డెరివేటివ్స్‌లో అపోలో హాస్పిటల్స్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, ఐబీ హౌసింగ్‌, నౌకరీ, పిరమల్‌, టొరంట్‌ ఫార్మా, పెట్రోనెట్‌, వేదాంతా 8-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు సన్‌ టీవీ, జీ, భారత్‌ ఫోర్జ్‌, మదర్‌సన్, సీమెన్స్‌, అమరరాజా, చోళమండలం, ఎంజీఎల్‌, అంబుజా 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,588 లాభపడగా.. 1,073 డీలాపడ్డాయి.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1514 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,239 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 6,207 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 3,464 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top