జోరుగా కార్పొరేట్‌ డీల్స్‌..

M and A, other corporate deals surpass pre-Covid levels in 2022: PwC India - Sakshi

2022లో కోవిడ్‌ పూర్వ స్థాయిని మించి నమోదు

2,103 లావాదేవీలు, 159 బిలియన్‌ డాలర్ల విలువ

పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా దేశీయంగా విలీనాలు, కొనుగోళ్లు (ఎంఅండ్‌ఏ).. ఇతరత్రా కార్పొరేట్‌ డీల్స్‌ మాత్రం గతేడాది భారీగానే జరిగాయి. కోవిడ్‌ పూర్వ స్థాయిని మించి 159 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 2,103 లావాదేవీలు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే విలువపరంగా 29 శాతం పెరిగాయి. 2022 వార్షిక నివేదికలో పీడబ్ల్యూసీ ఇండియా ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం మొత్తం డీల్స్‌లో ఎంఅండ్‌ఏ తరహా ఒప్పందాల వాటా అత్యధికంగా ఉంది. 20పైగా భారీ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 2021తో పోలిస్తే రెట్టింపై 107 బిలియన్‌ డాలర్ల స్థాయిలో నమోదైంది.

అయితే, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలీన డీల్‌ (సుమారు 60 బిలియన్‌ డాలర్లు)ను మినహాయిస్తే మాత్రం ఎంఅండ్‌ఏ ఒప్పందాల విలువ 2021తో పోలిస్తే 15 శాతం తగ్గిందని నివేదిక తెలిపింది. ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడులూ 2021తో పోలిస్తే 22 శాతం తగ్గి 52 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్లు పేర్కొంది. అయితే, అంతకన్నా ముందు మూడేళ్ల వ్యవధితో పోలిస్తే విలువ, పరిమాణంపరంగాను 20 శాతం ఎక్కువగానే నమోదైనట్లు వివరించింది. ఇన్వెస్టర్లు భారత్‌ను దీర్ఘకాలిక దృష్టితో చూస్తున్నారని, ప్రస్తుత మార్కెట్‌ మందగమనం కాస్త కష్టతరంగానే ఉన్నా చాలా మందికి పెద్దగా ఆందోళకరమైన అంశం కాకపోవచ్చని ఈ ధోరణుల ద్వారా తెలుస్తోందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్‌ దినేష్‌ ఆరోరా
తెలిపారు.

ఆకర్షణీయంగా ఆర్థిక సేవలు, టెక్నాలజీ..
దేశీయంగా ఆర్థిక సేవలు, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇంధనం, విద్యుత్, ఇండస్ట్రియల్స్‌ మొదలైన విభాగాలు ఆకర్షణీయంగా ఉండగలవని నివేదిక పేర్కొంది. గతేడాది కంపెనీలు తమ స్థానాలను పటిష్టపర్చుకోవడం, పోటీని కట్టడి చేయడం, కొత్త వినూత్న విభాగాల్లోకి ప్రవేశించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. దీనితో బ్యాంకింగ్, సిమెంట్, విమానయాన రంగాల్లో కొన్ని భారీ డీల్స్‌ చోటు చేసుకున్నాయని నివేదిక వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top