కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ లాభం రూ. 4,027 కోట్లు | Kotak Mahindra Bank Q4 net profit rises 13percent YoY to Rs 4,027 crore | Sakshi
Sakshi News home page

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ లాభం రూ. 4,027 కోట్లు

May 3 2026 5:37 AM | Updated on May 3 2026 5:37 AM

Kotak Mahindra Bank Q4 net profit rises 13percent YoY to Rs 4,027 crore

రుణ వృద్ధి, ప్రొవిజనింగ్‌ దన్ను 

నికర వడ్డీ ఆదాయం 8 శాతం వృద్ధి; రూ. 7,876 కోట్లు 

ఒక్కో షేరుపై రూ. 0.65 డివిడెండ్‌

న్యూఢిల్లీ: రుణాల వృద్ధి, మొండిబాకీలకు ప్రొవిజనింగ్‌ తగ్గుదల వంటి సానుకూలాంశాల ఊతంతో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 4,027 కోట్ల నికర లాభం (స్టాండెలోన్‌ ప్రాతిపదికన) ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 3,663 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 13 శాతం అధికం. లాభం సుమారు రూ. 3,737 కోట్లుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. 

సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ. 7,284 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ. 7,876 కోట్లకు పెరిగింది. రూ. 1 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై బ్యాంక్‌ బోర్డు రూ. 0.65 మేర డివిడెండ్‌ ఇవ్వాలని సిఫార్సు చేసింది.  రాబోయే రోజుల్లో మార్జిన్లు నిర్దిష్ట శ్రేణికి పరిమితం కావచ్చని బ్యాంక్‌ గ్రూప్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ దేవాంగ్‌ ఘీవాలా తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్‌ వేల్యుయేషన్‌ భారీగా ఉండటం వల్లే దాని కోసం పోటీపడలేదని ఎండీ అశోక్‌ వాస్వానీ తెలిపారు. 

ప్రభుత్వం నిర్దేశించిన కనీస ధర కన్నా తక్కువ రేటుకే బిడ్లు రావడమనేది అంచనాలకి, వాస్తవానికి మధ్య గల వ్యత్యాసాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాపారం యథాప్రకారంగానే ఉన్నప్పటికీ, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు సహా పశ్చిమాసియా ఉద్రిక్తతలకు సంబంధించి ఇతరత్రా ప్రభావాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. గృహ రుణాల మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు గణనీయంగా ఉనట్లు పేర్కొంది. సైబర్‌ రిస్క్ లు, ఏఐ సంబంధ ముప్పులను ఎదుర్కొనేందుకు సిస్టమ్స్‌ను పటిష్టం చేసుకోవడంపై బ్యాంకు మరింతగా పెట్టుబడులు పెడుతోంది.

మరిన్ని విశేషాలు..
→ నిర్వహణ లాభం వార్షికంగా 7 శాతం పెరిగి రూ. 5,855 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం 4.8 శాతం వృద్ధితో రూ. 14,175 కోట్లకు, వడ్డీ వ్యయాలు 0.9 శాతం పెరిగి రూ. 6,299 కోట్లకు చేరాయి. ఇతర ఆదాయం 2.1 శాతం క్షీణించి రూ. 3,116 కోట్లకు తగ్గింది.  

→ అసెట్‌ క్వాలిటీపరంగా చూస్తే స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 1.30 శాతం నుంచి 1.20 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌ఎన్‌పీఏ) 0.31 శాతం నుంచి 0.25 శాతానికి మెరుగుపడ్డాయి. ప్రొవిజనింగ్‌ గణనీయంగా 43 శాతం మేర తగ్గి రూ. 909 కోట్ల నుంచి రూ. 516 కోట్లకు నెమ్మదించి, లాభాలకు ఊతమిచ్చింది.  

→ నికర వడ్డీ మార్జిన్‌ వార్షికంగా 4.97 శాతం నుంచి 4.67 శాతానికి చేరింది. క్రితం క్వార్టర్‌లో ఇది 4.54 శాతంగా నమోదైంది. నిధుల సమీకరణ వ్యయాలు 5.09 శాతం నుంచి 4.45 శాతానికి తగ్గాయి. 

→ 2026 మార్చి 31 నాటికి నికరంగా రుణాలు 16 శాతం వృద్ధితో రూ. 4.96 లక్షల కోట్లకు చేరాయి.  

→ మొత్తం డిపాజిట్లు 15 శాతం వృద్ధి చెంది రూ. 5.72 లక్షల కోట్లకు చేరగా, కాసా (కరెంట్‌ అకౌంట్, సేవింగ్స్‌ అకౌంట్‌) నిష్పత్తి 43.3 శాతంగా ఉంది. రుణ, డిపాజిట్ల నిష్పత్తి 86.6 శాతంగా ఉంది.  

→ స్లిప్పేజీలు 32 శాతం తగ్గి రూ. 1,018 కోట్లకు దిగి వచ్చాయి.  

→ మొత్తం కస్టమర్ల సంఖ్య 5.2 కోట్లుగా ఉంది.  

→ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన లాభం 10 శాతం వృద్ధితో రూ. 4,933 కోట్ల నుంచి రూ. 5,423 కోట్లకు చేరగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 19,288 కోట్లుగా 
నమోదైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement