గృహ విక్రయాలు, లాంచింగ్స్‌లో హైదరాబాద్‌ రికార్డ్‌

Key Points About Hyderabad Realty Sector In Knight Frank India Report - Sakshi

దశాబ్దంలోనే అత్యుత్తమంగా కొనుగోళ్లు 

పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, రెరా ప్రతిబంధకాలు ఒకవైపు.. 

కరోనా, లాక్‌డౌన్, ఒమిక్రాన్‌ కట్టడి మరోవైపు..   

దేశంలోని ప్రధాన నగరాల రియల్టీ మార్కెట్‌ ప్రతికూలంలోకి జారిపోతే.. హైదరాబాద్‌ స్థిరాస్తి మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. గృహ విక్రయాలు, లాంచింగ్స్‌లోనూ చరిత్ర సృష్టించింది. దశాబ్ద కాలంలోనే అత్యుత్తమ స్థాయిలో గతేడాది 24,318 గృహాలు విక్రయమయ్యాయి. ఇదే సమయంలో రికార్డ్‌ స్థాయిలో 35,736 యూనిట్లు లాంచింగ్‌ అయ్యా యని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ఏ ఇతర నగరాలలో లేని విధంగా 2013 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‌లో ప్రాపర్టీల ధరలు తగ్గలేదు. 2020లో కరోనా మహమ్మారి సమయంలోనూ ధరలలో క్షీణత నమోదు కాకపోవటం గమనార్హం. అయినా సరే నేటికీ ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో ధరలు అందుబాటులోనే ఉన్నాయి. అందుకే గృహ కొనుగోలుదారులతో పాటూ ఇన్వెస్టర్లూ నగర రియల్టీ మార్కెట్‌ వైపు ఆసక్తిని కనబరుస్తున్నారు. గతేడాది హెచ్‌2లో నగరంలో ధరలు 5 శాతం మేర పెరిగాయి. గృహ ప్రవేశానికి సిద్ధమైన ఇళ్లకు, ప్రధాన డెవలపర్లయితే నిర్మాణంలో ఉన్న యూనిట్ల కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో 2020 హెచ్‌2లో 11.5 త్రైమాసికాలుగా ఉన్న ఇన్వెంటరీ.. గతేడాది హెచ్‌2 నాటికి 7.6 త్రైమాసికాలకు క్షీణించింది. రెడీ టు మూవ్‌ ప్రాజెక్ట్‌లకు డిమాండ్‌ పెరగడమే ఈ క్షీణతకు కారణం. 

హెచ్‌2లో 135 శాతం వృద్ధి రేటు.. 
గతేడాది జూలై– డిసెంబర్‌ (హెచ్‌2)లో నగరంలో 12,344 గృహాలు విక్రయమయ్యాయి. అంతకుక్రితం హెచ్‌2లో ఇవి 5,260లుగా ఉన్నాయి. ఏడాదిలో 135 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. అలాగే 2020 హెచ్‌2లో 8,404 యూనిట్లు లాంచింగ్‌ కాగా.. గతేడాది హెచ్‌2 నాటికి 126 శాతం వృద్ధి రేటుతో 19,024 గృహాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నగరంలో గృహాల ఇన్వెంటరీ 159 శాతం క్షీణించి 18,598లకు చేరాయి. వీటి విక్రయానికి 4.3 త్రైమాసికాల సమయం పడుతుంది. ఇందులో 12,141 యూనిట్లు పశ్చిమ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత 2,892 యూనిట్లు నార్త్‌లో, 1,643 ఈస్ట్‌లో, 1,230 సౌత్‌లో, 692 యూనిట్లు సెంట్రల్‌ హైదరాబాద్‌లో ఉన్నాయి. 

కొనసాగుతున్న పశ్చిమ హైదరాబాద్‌ జోరు.. 
మొదట్నుంచి నగర రియల్టీ మార్కెట్‌కు ఆయువు పట్టు కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్‌ ప్రాంతాలే. ఎప్పటిలాగే గతేడాది లాంచింగ్‌ అయిన యూనిట్లలో 64 శాతం వెస్ట్‌ జోన్‌లోనే ఎక్కువగా ప్రారంభమయ్యాయి. కోకాపేట, పీరంచెరు, గోపన్‌పల్లి, నల్లగండ్లలో ఎక్కువగా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విక్రయాలలో కూడా పశ్చిమ హెదరాబాద్‌ జోరు కొనసాగింది. గతేడాది విక్రయమైన యూనిట్లలో 60 శాతం ఈ జోన్‌లోనే జరిగాయి. హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, నానక్‌రాంగూడలోని కార్యాలయాలకు దగ్గరగా ఉండాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు. 23 శాతం రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న గృహాలు, 48 శాతం రూ.50 లక్షల నుంచి రూ.కోటి, 30 శాతం రూ.కోటిపైన ధర ఉండే యూనిట్లు అమ్ముడుపోయాయి. 

కరోనాతో గృహాలకు డిమాండ్‌.. 
హైదరాబాద్‌లో గృహాల విక్రయాలలో ఐటీ ఉద్యోగుల వాటానే ఎక్కువగా ఉంటుంది. కరోనా తర్వాతి నుంచి ఐటీ, ఫార్మా మినహా అన్ని రంగాలు కొంత ప్రభావితమయ్యాయి. నగర మార్కెట్‌లో ఈ రెండు రంగాలు బాగుండటంతో గృహ విక్రయాలకూ ప్రభావితం కాలేదు. ఇంకా చెప్పాలంటే కరోనా తర్వాత ఇంటి అవసరం ఇంకా ఎక్కువగా పెరిగింది. వర్క్‌ ఫ్రం హోమ్, ఆన్‌లైన్‌ క్లాస్‌లు కొనసాగుతున్న నేపథ్యంలో విస్తీర్ణమైన గృహాలు, వ్యక్తిగత గృహాలకు మరింత డిమాండ్‌ ఏర్పడింది.  

చదవండి: యాదాద్రిని చూపించి వరంగల్‌ హైవే మార్కెట్‌ని పాడు చేశారు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top