రూ.10 వేల లోపు ఫోన్లలో నెం.1 బ్రాండ్‌ ఇదే.. | Itel Emerges as Indias Most Reliable Brand in Sub Rs 10000 Segment CMR Report | Sakshi
Sakshi News home page

రూ.10 వేల లోపు ఫోన్లలో నెం.1గా ఊహించని బ్రాండ్‌

May 3 2026 10:58 AM | Updated on May 3 2026 11:09 AM

Itel Emerges as Indias Most Reliable Brand in Sub Rs 10000 Segment CMR Report

బడ్జెట్‌ ధరలో స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లను అందిస్తున్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ ‘ఐటెల్‌’ భారత స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో మన్నిక, విశ్వసనీయతలో అగ్రస్థానంలో నిలిచింది. సైబర్‌ మీడియా రీసెర్చ్‌ (సీఎంఆర్‌) తాజాగా విడుదల చేసిన ‘భారతదేశ డివైజ్‌ మార్కెట్లో మన్నిక, విశ్వసనీయత, అందుబాటు ధరల ప్రాధాన్యత’ అనే నివేదికలో ఐటెల్‌ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దేశవ్యాప్తంగా 13 నగరాల్లో 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల 2,086 మంది వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

డ్యూరబులిటీ ఇండెక్సులో అగ్రస్థానం
రూ.10,000 లోపు ధర కలిగిన మొబైల్‌ విభాగంలో 0.86 మన్నిక(డ్యూరబులిటీ) సూచికతో ఐటెల్‌ మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత శాంసంగ్‌ (0.79), వివో (0.72) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా ఫీచర్‌ ఫోన్‌ విభాగంలో 91% మంది వినియోగదారులు ఐటెల్‌ మన్నికైన బ్రాండ్‌ అని వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్‌ విభాగంలోనూ 85% స్కోరుతో ఐటెల్‌ రెండో స్థానంలో నిలిచింది.

నివేదికలో మరిన్ని అంశాలు
దాదాపు 81% మంది వినియోగదారులు ఐటెల్‌ను బలమైన, మన్నికకు మారుపేరుగా భావిస్తున్నారు. 79% మంది దీని డిజైన్‌ సౌకర్యవంతంగా ఉందని ప్రశంసించారు.  74% మంది ఈ బ్రాండ్‌ను అత్యంత నమ్మదగినదిగా గుర్తించారు.  85% మంది తాము చెల్లించే ధరకు తగిన గొప్ప విలువ (వాల్యూ ఆఫ్‌ మనీ) లభిస్తుందని నమ్ముతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 51% మంది భవిష్యత్తులో ఐటెల్‌ ఫీచర్‌ ఫోన్‌ను, 30% మంది ఐటెల్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.

Advertisement
 
Advertisement
Advertisement