బంగారం ఫండ్‌లో సిప్‌ చేయొచ్చా?

Is It Good To Invest Sip In Gold Fund - Sakshi

స్టాక్‌మార్కెట్‌ పతనాల్లో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఏ విధమైన ప్రభావం ఉంటుంది?     
– అమిత్‌ 
ఈక్విటీ మార్కెట్లు పడిపోయిన సందర్భాల్లో డెట్‌ ఫండ్స్‌పై పెద్ద ప్రభావం ఉండదు. ఎందుకంటే స్థిరాదాయ పథకాల మార్కెట్‌ తీరుతెన్నులు భిన్నంగా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం, ద్రవ్యోల్బణ రేట్లు డెట్‌ ఫండ్స్‌పై ప్రభావం చూపిస్తాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంటే వడ్డీ రేట్లు కూడా పెరిగిపోతాయి. దీనివల్ల బాండ్ల రేట్లపై ప్రభావం పడుతుంది. వడ్డీ రేట్లు తగ్గిపోతున్న సందర్భాల్లో బాండ్లపై రాబడులు పెరుగుతాయి. క్రెడిట్‌ నాణ్యత లేదా ఆయా బాండ్ల క్రెడిట్‌ రేటింగ్‌లు కూడా ప్రభావం చూపిస్తాయి. బలహీన ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా కంపెనీలు సమస్యలను చూస్తున్నట్టయితే.. ఆయా కంపెనీలు బాండ్లపై వడ్డీ చెల్లింపులు చేయలేని పరిస్థితులు నెలకొంటే క్రెడిట్‌ రేటింగ్‌ క్షీణించడానికి దారితీస్తుంది. అది డెట్‌ ఫండ్స్‌పై ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత లిక్విడిటీ కూడా ముఖ్యమైన అంశం అవుతుంది. వ్యవస్థలో నగదు లభ్యత తగ్గినప్పుడు బాండ్లపై ప్రభావం ఉంటుంది. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ మార్కెట్‌పై ఈ అంశాలన్నీ ప్రభావం చూపిస్తాయిని తెలుసుకోవాలి. బాండ్లలో రాబడులు తక్కువగా ఉన్న సమయంలో.. రిస్క్‌ తీసుకోవడం వల్ల అధిక రాబడులకు ఈక్విటీల్లో అవకాశం ఉంటుంది. కనుక వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ వైపు మొగ్గు చూపుతుంటారు.

ఐదేళ్ల కాలానికి బంగారం ఫండ్‌లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా?
– కౌశిక్‌ 
సాధారణంగా చెప్పుకోవాలంటే బంగారం ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయకూడదు. దీర్ఘకాలానికి బంగారాన్ని పెట్టుబడి సాధనంగా ఎంపిక చేసుకోకూడదు. ఎందుకంటే నిల్వ ఉండే విలువే కానీ.. పెట్టుబడిని వృద్ధి చేసేది కాదు. బాండ్స్‌ లేదా స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసినప్పుడు ఒకరికి మీరు రుణం ఇచ్చినట్టు అవుతుంది. దానిపై మీకు ఊహించతగిన రాబడులు వస్తాయి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసినప్పుడు కంపెనీలో ఆ మేరకు వాటాలు పొందినట్టు అవుతుంది. కంపెనీ లాభాలు, డివిడెండ్‌లలో ఆ మేరకు వాటా లభిస్తుంది. బంగారంలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల వచ్చేదేమీ లేదు. ఇది ఉత్పాదకత సాధనం కాదు. అందుకనే దీర్ఘకాల పెట్టుబడుల విషయంలో బంగారానికి దూరంగా ఉండాలి. బంగారాన్ని ఈటీఎఫ్‌ల రూపంలో కలిగి ఉండడం మరో మార్గం. కానీ, దీనిపై ఎక్స్‌పెన్స్‌ రేషియో రూపంలో వ్యయాలను భరించాల్సి ఉంటుంది. పైగా డీమ్యాట్‌ ఖాతా లేకుంటే వీటిని కొనుగోలు చేసుకోవడం కుదరదు. సులభంగా కొనుగోలు చేసుకోవడానికి ఇదొక అడ్డంకి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసే బంగారం ఫండ్స్‌ కూడా ఉన్నాయి. కానీ, వీటిల్లో ఈటీఎఫ్‌ల కంటే ఎక్కువ చార్జీలుంటాయి. సౌర్వభౌమ బంగారం బాండ్ల (ఎస్‌జీబీలు) రూపంలో బంగారాన్ని కలిగి ఉండడం చక్కని మార్గం అవుతుంది. దేశీయ ఇన్వెస్టర్లకు ఇదొక ఆకర్షణీయమైన సాధనం. కొనుగోలు చేసుకోవడం సులభంగా ఉంటుంది. బ్యాంకు ద్వారా ప్రభుత్వం నుంచి నేరుగా ఎస్‌జీబీలను కొనుగోలు చేసుకోవచ్చు. సెకండరీ మార్కెట్లోనూ అందుబాటులో ఉంటాయి. ఎస్‌జీబీలపై.. వార్షికంగా 2.5 శాతం వడ్డీ రాబడి లభిస్తుంది. బంగారం ధరల వృద్ధి, క్షీణతతో సంబంధం లేకుండా వడ్డీ చెల్లింపులు ఉంటాయి. బంగారం ధరల్లో మార్పునకు ఈ వడ్డీ రాబడి అదనం.  కనుక దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్‌ చేసుకోవాలంటే అందుకు ఎస్‌జీబీ ఒక్కటే మెరుగైన సాధనం అవుతుంది.   

- ధీరేంద్ర కుమార్‌, సీఈవో, వాల్యూ రీసెర్చ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top