
జూన్ త్రైమాసికంలో 1.67 కోట్లు
‘గ్రో’లో అత్యధికంగా 42 లక్షలు జత..
మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ సిప్‌ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా పెట్టుబడులు పెరగడం కొనసాగుతోంది. జూన్ త్రైమాసికంలో కొత్త సిప్ ఖాతాలు 1.67 కోట్ల మేర నమోదయ్యాయి. క్రితం క్వార్టర్‌లో నమోదైన 1.41 కోట్లతో పోలిస్తే ఇది అధికం. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం 41.9 లక్షల కొత్త సిప్‌లు, 25 శాతం మార్కెట్ వాటాతో గ్రో సంస్థ అగ్రగామిగా నిలిచింది. నెలవారీగా చూస్తే జూన్‌లో గ్రోలో కొత్త సిప్‌లు 15.7 లక్షలుగా రిజిస్టరయ్యాయి.
విలువపరంగా చూస్తే కొత్త సిప్‌లు 32 శాతం పెరిగి రూ. 1,116 కోట్లకు చేరాయి. మరోవైపు, ఏంజెల్ వన్‌లో కొత్తగా 15 లక్షల సిప్‌లు, ఎన్‌జే ఇండియాఇన్వెస్ట్‌లో 5.9 లక్షలు, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో 3.8 లక్షలు, డిజిటల్ ప్లాట్‌ఫాం ఫోన్‌పేలో 5.9 లక్షల సిప్‌లు నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నప్పటికీ మ్యూ చువల్ ఫండ్స్‌పై రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి మెరుగ్గానే ఉంటోంది.
మరిన్ని వివరాలు..
మ్యూచువల్ ఫండ్స్‌లో జూన్‌లో రికార్డు స్థాయిలో రూ. 27,269 కోట్ల మేర సిప్ పెట్టుబడులు వచ్చాయి. సిప్‌ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) గతేడాది జూన్ 30 నాటి గణాంకాలతో పోలిస్తే ఈసారి జూన్ 30 నాటికి రూ. 15.3 లక్షల కోట్లకు చేరింది.
2025లో మ్యూచువల్ ఫండ్ విశిష్ట ఇన్వెస్టర్ల సంఖ్య 5.4 కోట్లకు చేరింది. 2023లో 3.8 కోట్లతో పోలిస్తే 42 శాతం, 2024లోని 4.5 కోట్లతో పోలిస్తే 20 శాతం పెరిగింది.
2025 జూన్ ఆఖరు నాటికి పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రికార్డు స్థాయిలో 74.4 లక్షల కోట్లకు చేరింది. క్రితం క్యూ1లో నమోదైన రూ. 63.2 లక్షల కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగింది.
రిటైల్ ఇన్వెస్టర్లు సంప్రదాయ పొదుపు విధానాల నుంచి పెట్టుబడుల మైండ్‌సెట్ వైపు మళ్లుతున్నారు. మ్యుచువల్ ఫండ్స్‌ను దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనాలుగా భావిస్తున్నారు.
సులభతరంగా ఇన్వెస్ట్ చేసే విధానాలను డిజిటల్–ఫస్ట్ ప్లాట్‌ఫాంలు మరింతగా అందుబాటులోకి తేవడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి. అలాగే యాంఫీ, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూడా ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు ఉపయోగపడుతున్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ విధానాన్ని ప్రోత్సహించడంలో, మ్యుచువల్ ఫండ్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఇదీ చదవండి: కరెంట్ బిల్లు పరిధి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే!