కళ తప్పిన గోల్డ్‌ ఈటీఎఫ్‌లు | Inflow in gold ETFs drops 90percent in 2022 | Sakshi
Sakshi News home page

కళ తప్పిన గోల్డ్‌ ఈటీఎఫ్‌లు

Jan 25 2023 4:19 AM | Updated on Jan 25 2023 4:19 AM

Inflow in gold ETFs drops 90percent in 2022 - Sakshi

న్యూఢిల్లీ: గోల్డ్‌ ఎక్సేంజెడ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ గతేడాది పెద్దగా పెట్టుబడులను ఆకర్షించలేకపోయాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2022లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు 90 శాతం తగ్గిపోయి, రూ.459 కోట్లకు పరిమితమయ్యాయి. 2021లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ పథకాలు రూ.4,814 కోట్లను ఆకర్షించగా, 2020లో రూ.6,657 కోట్ల పెట్టుబడులు వీటిల్లోకి రావడం గమనార్హం. అయితే గతేడాది గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం/పెట్టుబడులు), ఫోలియోలు పెరగడాన్ని గమనించొచ్చు.

ఒక ఇన్వెస్టర్‌ పెట్టుబడికి కేటాయించే గుర్తింపునే ఫోలియోగా చెబుతారు. 2021 చివరి నాటికి గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.18,405 కోట్లుగా ఉంటే, 2022 డిసెంబర్‌ చివరికి 16 శాతం వృద్ధితో రూ.21,455 కోట్లకు చేరాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఫోలియోల సంఖ్య గతేడాది 14.29 లక్షలు పెరగడంతో మొత్తం ఫోలియోల సంఖ్య 46.28 లక్షలకు చేరింది. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల పట్ల ఇన్వెస్టర్లలో విశ్వాసానికి ఇది నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు.

‘‘బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనక్కి తగ్గి ఉండొచ్చు. వడ్డీ రేట్లు పెరుగుదల, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లతో ఈ ఏడాది ఎక్కువ భాగం ఆర్థిక వ్యవస్థ సవాళ్లను చూడొచ్చు’’అని మార్నింగ్‌ స్టార్‌ ఇండియా సీనియర్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ కవితా కృష్ణన్‌ పేర్కొన్నారు. ఇక గతేడాది గోల్డ్‌ ఈటీఎఫ్‌ల కంటే ఇన్వెస్టర్లు ఈక్విటీలవైపు మొగ్గు చూపించారు. ఈక్విటీ పథకాలు గతేడాది రూ.1.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం దీన్నే తెలియజేస్తోంది. అయినప్పటికీ బంగారం ఈటీఎఫ్‌లు నికరంగా పెట్టుబడులను ఆకర్షించడం సానుకూలం.

ఇక ముందు ఏంటి పరిస్థితి?
మార్కెట్లలో అస్థిరతలు కొనసాగితే ఇక ముందూ గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గేమ్‌ ఆధారిత సేవింగ్స్‌ యాప్‌ ‘ఫెల్లో’ సీఈవో మనీష్‌మర్యాద మాత్రం సార్వభౌమ బంగారం బాండ్ల (ఎస్‌జీబీలు) మాదిరే గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు సైతం పన్ను ప్రయోజనం అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘మార్కెట్లో ఎస్‌జీబీల గురించే చర్చ నడుస్తోంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల కంటే ఎస్‌జీబీల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు.

ఎందుకంటే ఎస్‌జీబీలకు పన్ను ప్రయోజనం ఉండడమే. ఎస్‌జీబీల మాదిరే గోల్డ్‌ ఈటీఎఫ్‌లు వృద్ధి చెందాలంటే, దీర్ఘకాల మూలధన లాభాల పన్నును సగానికి తగ్గించాలి. ఇది మంచి సానుకూల చర్య అవుతుంది. బంగారంలో దీర్ఘకాలం కోసమే ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతుంటారు. కనుక గోల్డ్‌ ఈటీఎఫ్‌లను ఈఎల్‌ఎస్‌ఎస్‌ మాదిరి పన్ను ఆదా సాధనం కింద వర్గీకరించడం వల్ల ఎక్కువ మంది ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తారు. ఇదొక ప్రధాన పెట్టుబడి సాధనంగా మారుతుంది’’అని మర్యాద చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement