
ఏప్రిల్ నెలలో స్వల్ప క్షీణత
ఆల్‌టైమ్ గరిష్టానికి సిప్ పెట్టుబడులు
డెట్ ఫండ్స్‌కు మళ్లీ ఆదరణ
యాంఫి గణాంకాలు విడుదల
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక ఏప్రిల్ నెలలో స్వల్పంగా క్షీణించింది. మార్చి నెలలో వచ్చిన పెట్టుబడులు రూ.25,082 కోట్లతో పోల్చి చూస్తే 3 శాతం క్షీణించి రూ.24,269 కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్‌లో ఈక్విటీ మార్కెట్లు నష్టాల నుంచి కోలుకున్నప్పటికీ పెట్టుబడులు తగ్గడం గమనార్హం. ఏప్రిల్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 3.65 శాతం, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 3.46 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఏప్రిల్ నెలలో వచ్చిన పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి.
ఈ మేరకు ఏప్రిల్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి నెలవారీ పెట్టుబడుల రాక తగ్గడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైంది. అయినప్పటికీ ఈక్విటీ పథకాల్లోకి వరుసగా 50వ నెలలోనూ నికర సానుకూల పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు రాక తగ్గడం అన్నది యూఎస్ టారిఫ్‌ల పట్ల అనిశి్చతి, డెట్, హైబ్రిడ్ పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇవ్వడం కారణమని ఈక్విరస్ వెల్త్ ఎండీ అంకుర్ పుంజ్ తెలిపారు.
సిప్ పెట్టుబడులు రూ.26,632 కోట్లు
ఇన్వెస్టర్లు దీర్ఘకాల లక్ష్యాల కోసం చేసే సిప్ పెట్టుబడులు ఏప్రిల్ నెలలో రూ.26,632 కోట్లుగా ఉన్నాయి. ఒక నెలలో సిప్ గరిష్ట పెట్టుబడులు ఇదే ప్రథమం. మార్చి నెలలో సిప్ పెట్టుబడులు రూ.25,926 కోట్లతో పోల్చి చూస్తే 3 శాతం పెరిగాయి. ఏప్రిల్‌లో కొత్తగా 46.01 లక్షల సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. మార్చిలో కొత్త సిప్ ఖాతాలు 40.18 లక్షలుగా ఉన్నాయి. మొత్తం సిప్ ఖాతాలు 8.38 కోట్లకు చేరాయి.
సిప్ నిర్వహణ ఆస్తుల విలువ మార్చి చివరికి రూ.13.35 లక్షల కోట్లుగా ఉంటే, ఏప్రిల్ చివరికి రూ.13.89 లక్షల కోట్లకు పెరిగింది. ‘‘ఏప్రిల్‌లో సిప్ పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్టం అయిన రూ.26,632 కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్స్‌ను క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాల పొదుపు సాధనంగా ఇన్వెస్టర్లు పరిగణిస్తుండడం వల్లే పెట్టుబడులు ఇలా క్రమంగా పెరుగుతున్నాయి’’అని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. అన్ని మారెŠక్ట్ సైకిల్స్‌లోనూ పెట్టుబడులు కొనసాగించడానికి ఉన్న ప్రాధాన్యం పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతున్నట్టు చెప్పారు.
విభాగాల వారీ పెట్టుబడులు
→ ఏప్రిల్‌లో డెట్ ఫండ్స్‌లోకి మొత్తంగా రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో రూ.2.02 లక్షల కోట్లను ఉపసంహరణతో పోలి్చతే సీన్ రివర్స్ అయింది.
→ డెట్‌లోని మొత్తం 16 విభాగాలకు గాను 12 రకాల పథకాల్లోకి పెట్టుబడులు సానుకూలంగా ఉన్నాయి. అత్యధికంగా రూ.1.18 లక్షల కోట్లు లిక్విడ్ ఫండ్స్‌లోకే వచ్చాయి.
→ మొత్తం మీద అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఏప్రిల్‌లో రూ.2.77 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో రూ.1.64 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోవడం గమనార్హం.
→ దీంతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తుల (అన్ని విభాగాలు సహా) విలువ ఏప్రిల్ చివరికి రూ.70 లక్షల కోట్లకు చేరింది. మార్చి చివరికి ఇది రూ.65.74 లక్షల కోట్లుగా ఉంది.
→ ఈక్విటీ పథకాల్లోకి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.29,303 కోట్లు, జనవరిలో రూ.39,688 కోట్లు, 2024 డిసెంబర్‌లో రూ.41,156 కోట్ల చొప్పున వచ్చాయి.
→ ఈక్విటీ విభాగంలో ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అత్యధికంగా రూ.5,542 కోట్ల పెట్టుబడులను ఏప్రిల్‌లో ఆకర్షించాయి.
→ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు ఆదరణ కొనసాగింది. మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.3,314 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,000 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి.
→ లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,671 కోట్లు వచ్చాయి. మార్చి నెలలో ఈ విభాగంలోకి
వచ్చిన పెట్టుబడులు రూ.2,479 కోట్లుగా ఉన్నాయి.
→ హైబ్రిడ్ ఫండ్స్ రూ.14,247 కోట్లను ఆకర్షించాయి. మార్చి నెలలో ఈ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.946 కోట్లను ఉపసంహరించుకున్నారు.
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో అమ్మకాలు
గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) నుంచి ఇన్వెస్టర్లు రూ.6 కోట్లను ఉపసంహరించుకున్నారు. మార్చిలోనూ గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి రూ.77 కోట్లకు వెనక్కి తీసుకోవడం గమనార్హం. బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులు నిలిపివేయడంతోపాటు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది.