భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచగా, దేశీయ సూచీలు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో నిఫ్టీ ఒకానొక దశలో 23,882 పాయింట్లకు పడిపోయి, ఆ తర్వాత కోలుకుని 24,032 పాయింట్ల వద్ద ముగిసింది. అటు సెన్సెక్స్ కూడా 76,515 పాయింట్ల డే కనిష్టాన్ని తాకి చివరకు 77,017 పాయింట్ల వద్ద స్థిరపడింది.
మార్కెట్ ఒడిదొడుకులకు కారణాలు(అంచనా)
పశ్చిమాసియా యుద్ధం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న వివాదం, ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ప్రతిష్టంభన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మార్కెట్‌లో భయాన్ని పెంచాయి.
క్రూడాయిల్ ధరల సెగ
చమురు సరఫరాలో అంతరాయాల భయం క్రూడాయిల్ ధరలను రికార్డు స్థాయిలకు చేర్చింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో క్రూడాయిల్ ధరలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థపై, ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల భయం
అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండదని, పైగా అవి మరింత పెరగవచ్చనే ఆందోళనలు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో కనిపిస్తున్నాయి. ఇది పెట్టుబడుల ఉపసంహరణకు దారితీస్తోంది.
లాభాల స్వీకరణ, అప్రమత్తత
గత కొద్ది రోజులుగా మార్కెట్ స్వల్పంగా కోలుకోవడంతో లాభాల్లో ఉన్న ఇన్వెస్టర్లు అప్రమత్తమై లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముఖ్యంగా కీలకమైన ప్రతిఘటన స్థాయిల వద్ద (రెసిస్టెన్స్ లెవల్స్) ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడిని పెంచడం వల్ల సూచీలు ఒక దశలో బలహీనపడ్డాయి.
నెక్ట్స్ ఏంటి?
ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ కాన్సాలిడేషన్‌లో ఉందని తెలుస్తుంది. నిఫ్టీ 23,800-24,300 శ్రేణిలో కదలాడుతోంది. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి, క్రూడాయిల్ ధరలు స్థిరీకరణ చెందితే తప్ప మార్కెట్ పురోగతిని సాధించడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా భౌగోళిక పరిణామాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం మంచిదని మార్కెట్ నిపుణుల సూచన.
ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ తయారీలోకి ఓపెన్‌ఏఐ ఎంట్రీ?


