ఎకానమీ శుభ సంకేతాలు!

IIP growth rebounds to 7. 1percent in November; retail inflation eases to 5. 7percent in December - Sakshi

నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి 7.1 శాతం వృద్ధి

ఐదు నెలల గరిష్టం

డిసెంబర్‌లో ఏడాది దిగువకు ధరల స్పీడ్‌

వరుసగా రెండవనెల నిర్దేశిత 6 శాతంలోపు నమోదు

న్యూఢిల్లీ: భారత్‌ ఎకానమీకి సంబంధించి వెలువడిన తాజా గణాంకాలు ఆశాజనక పరిస్థితిని సృష్టించాయి. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధికి సంబంధించి సూచీ– ఐఐపీ 2022 నవంబర్‌లో (2021 నవంబర్‌తో పోల్చి) ఐదు నెలల గరిష్ట స్థాయి 7.1 శాతంగా నమోదయితే, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక పాలసీ రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి పడిపోయింది. ఈ సూచీ వరుసగా రెండవనెల ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువన 5.72 శాతంగా నమోదయ్యింది. 2022 అక్టోబర్‌లో ఐఐపీలో అసలు వృద్ధి లేకపోగా 4.2 శాతం క్షీణించింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) గురువారం ఈ గణాంకాల ముఖ్యాంశాలు...

కీలక రంగాల పురోగతి
► తయారీ: సూచీలో మెజారిటీ వెయిటేజ్‌ ఉన్న ఈ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు నవంబర్‌లో 6.1 శాతంగా నమోదయ్యింది.
► మైనింగ్‌: ఈ రంగంలో 9.7 శాతం పురోగతి ఉంది.  
► విద్యుత్‌: విద్యుత్‌ ఉత్పత్తి వృద్ధి భారీగా 12.7 శాతం నమోదయ్యింది.  
► క్యాపిటల్‌ గూడ్స్‌: భారీ యంత్ర పరికరాల ఉ త్పత్తి, డిమాండ్‌ను సూచించే ఈ విభాగం ఏకంగా 20.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.  
డ్యూరబుల్స్‌: ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ఉత్పత్తికి సంబంధించి కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో 5.1 శాతం వృద్ధి నమోదుకాగా, సబ్సులు, పెర్‌ఫ్యూమ్స్‌ వంటి ఎఫ్‌ఎంసీజీ విభాగానికి సంబంధించిన కన్జూమర్‌ నాన్‌–డ్యూరబుల్స్‌ విభాగంలో వృద్ధి రేటు 8.9 శాతంగా ఉంది.  
► ఇన్‌ఫ్రా, నిర్మాణం: వృద్ధి 12.8 శాతంగా నమోదయ్యింది.  
► తొమ్మిది నెలల్లో..: ఇక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్య  ఐఐపీ వృద్ధి రేటు 5.5 శాతంగా ఉంది.

తగ్గిన ఫుడ్‌ బాస్కెట్‌ ధరల స్పీడ్‌
డిసెంబర్‌లో ఫుడ్‌ బాస్కెట్‌ తగ్గడం మొత్త రిటైల్‌ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాల్సి ఉండగా, 2022 అక్టోబర్‌ వరకూ వరుసగా 10 నెలలు ఆ పైన కొనసాగింది. నవంబర్‌లో 5.88 శాతంగా నమోదుకాగా, మరుసటి నెల డిసెంబర్‌లో మరింత తగ్గి 5.72 శాతానికి (2021 డిసెంబర్‌తో పోల్చి)  చేరడం ఎకానమీకి ఊరటనిచ్చే అంశం. ఎన్‌ఎస్‌ఓ గణాంకాల ప్రకారం, ఫుడ్‌ బాస్కెట్‌ ధరల స్పీడ్‌  నవంబర్‌లో 4.67 శాతం ఉండగా, డిసెంబర్‌లో మరింత తగ్గి 4.19 శాతానికి చేరింది.

కూరగాయల ధరల స్పీడ్‌ వార్షికంగా 15 శాతానికి పైగా పడిపోయింది. పండ్ల ధరల స్పీడ్‌ 2 శాతంగా ఉంది. అయితే సుగంధ ద్రవ్యాల ధరలు మాత్రం 20 శాతం పెరిగాయి. తృణ ధాన్యాల ధరలు 14 శాతం ఎగశాయి. ఫ్యూయల్‌ అండ్‌ లైట్‌ విభాగంలో ధరల పెరుగుదల రేటు 11 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా 2022 మే తర్వాత ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోన 2.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 6.25 శాతానికి చేరింది. కొన్ని కమోడిటీల ఎగుమతుల నిషేధంసహా ధరల కట్టడికి కేంద్రం కూడా పలు చర్యలు తీసుకుంటోంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top