
Money Transfer Using UPI Without Internet: ప్రస్తుత ఈ డీజీటల్ ప్రపంచంలో టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న కొద్ది కొత్త కొత్త సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మొబైల్ అందుబాటులోకి వచ్చిన కొత్తలో స్మార్ట్‌ఫోన్ నుంచి పేమెంట్స్ చేసే విధానం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లోనే బ్యాంకింగ్ లావాదేవీలన్నీ సులువుగా జరుగుతున్నాయి. ప్రజలు రోజుకు లక్షల రూపాయలను క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. అయితే, ఈ సేవలన్నీ వాడుకోవాలంటే స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ఉండాలి. కానీ, ఇంటర్నెట్ లేకున్నా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు అనే విషయం మనలో ఎందరికి తెలుసు.
అవును, మీరు విన్నది నిజమే!. మన స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకున్నా ఇతరులకు డబ్బులు పంపించే అవకాశం ఉంది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి సులువుగా లావాదేవీలు జరపొచ్చు. ఆఫ్‌లైన్‌లో యూపీఐ లావాదేవీలు ఉపయోగించుకోవడానికి యూజర్లు *99# డయల్ చేయాల్సి ఉంటుంది. USSD 2.0 పద్ధతి ద్వారా ఈ సర్వీస్ ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. అయితే, ఈ విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) తీసుకొచ్చింది. ఆగస్టు 2016లో ఎన్‌పీసీఐ రెండు డీజీటల్ చెల్లింపు పద్ధతులను(యుపీఐ & *99#) ఇంటిగ్రేట్ చేసింది. ఇప్పుడు యూపీఐ లావాదేవీలకు ఇదే నెంబర్‌ను యూజర్లు ఉపయోగించుకోవచ్చు. మరి ఇంటర్నెట్ లేకపోయినా డబ్బులు పంపడానికి ఏఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి.
స్మార్ట్‌ఫోన్‌లో *99# సౌకర్యాన్ని ఎలా ఉపయోగించాలి?
- మీ స్మార్ట్‌ఫోన్‌లో డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *99# అని టైప్ చేయండి.
- ఇప్పుడుMy Profile', 'Send Money', 'Receive Money', 'Pending Requests', 'Check Balance', 'UPI PIN', 'Transactions' అనే కొన్ని ఆప్షన్స్ వస్తాయి.
- డబ్బులు పంపాలంటే డయల్ ప్యాడ్‌లో 1 ప్రెస్ చేసి Send Money ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
- ఇప్పుడు మీరు మీరు ఫోన్ నెంబర్, యూపీఐ ఐడీ, అకౌంట్ నెంబర్ నుంచి డబ్బులు పంపే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.
- ఈ పేమెంట్స్ మెథడ్‌లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
- ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేస్తే మీరు ఎవరికి డబ్బులు పంపాలో వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- ఒకవేళ మీరు యుపీఐని ఎంచుకున్నట్లయితే, అప్పుడు మీరు యుపీఐ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది.
- బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 11 అంకెల ఐఎఫ్ఎస్‌సీ కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత మీరు ఎంత మొత్తం పంపాలనుకుంటున్నారో టైప్ చేయాలి.
- ఆ తర్వాత మీ యూపీఐ పిన్ నమోదు చేసి send పైన క్లిక్ చేయాలి.
- ఇలా చేస్తే మీ అకౌంట్ నుంచి అవతలి వారి అకౌంట్‌లోకి డబ్బులు వెళ్తాయి.
డబ్బు బదిలీ చేసిన తర్వాత రిఫరెన్స్ ఐడితో పాటు ఇతర లావాదేవీల వివరాలు కనిపిస్తాయి. భవిష్యత్తు లావాదేవీల కోసం లబ్ధిదారుడీగా గ్రహీతను సేవ్ చేయమని మిమ్మల్ని కోరుతుంది. ఈ సర్వీస్ ఉపయోగించడం వల్ల రూ.0.50 స్వల్ప ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా గరిష్టంగా రూ.5 వేలు మాత్రమే పంపించడానికి అవకాశం ఉంటుంది.
(చదవండి: ఓలా ఎలక్ట్రిక్ సంచనలం.. దేశంలో మరో భారీ ప్లాంట్ నిర్మాణం!)