బంగారం- వెండి.. రికార్డులే రికార్డులు

Gold, Silver price hits new historical highs - Sakshi

ప్రస్తుతం కామెక్స్‌లో 2034 డాలర్లకు ఎగువన పసిడి

మంగళవారం 35 డాలర్లు అప్‌-2021 డాలర్లకు

తద్వారా తొలిసారి 2000 డాలర్ల ఎగువన ముగింపు

ఈ బాటలో ఔన్స్‌ 26 డాలర్లను అధిగమించిన వెండి  

ఏడాదిన్నర కాలంలో 3000 డాలర్లకు పసిడి- అంచనాలు

ఎంసీఎక్స్‌లో రూ. 54,770కు చేరిన 10 గ్రాముల పసిడి

రూ. 70,000 సమీపంలో ట్రేడవుతున్న కేజీ వెండి ధర

ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులతోపాటు.. సాధారణ ప్రజలకూ అత్యంత ప్రీతిపాత్రమైన బంగారం, వెండి ధరలు మరింత ప్రియమయ్యాయి.  బులియన్‌ చరిత్రలో తొలిసారి అటు ఫ్యూచర్స్‌,.. ఇటు స్పాట్‌ మార్కెట్లలో బంగారం ధరలు మంగళవారం 2,000 డాలర్లకు ఎగువన ముగిశాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) దాదాపు 35 డాలర్లు జంప్‌చేసి 2021 డాలర్ల వద్ద ముగసింది. ఇక స్పాట్‌ మార్కెట్లోనూ పసిడి 2019 డాలర్ల వద్ద నిలిచింది.  తద్వారా సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇక వెండి సైతం ఔన్స్‌ 26 డాలర్లను దాటేసింది. వెరసి 2013 తదుపరి గరిష్ట స్థాయికి వెండి చేరింది!

దేశీయంగానూ
ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 0.6 శాతం బలపడి 2032 డాలర్లకు ఎగువన కదులుతోంది. స్పాట్‌ మార్కెట్లో మాత్రం 0.2 శాతం నీరసించి 2014 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి సైతం 0.3 శాతం నీరసించి 26 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. కాగా..  దేశీయంగా ఎంసీఎక్స్‌లో మంగళవారం 10 గ్రాముల పసిడి రూ. 834  లాభపడి రూ. 54,551 వద్ద నిలిచింది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధరకాగా.. సెప్టెంబర్ ఫ్యూచర్స్‌ వెండి కేజీ ధర రూ. 4049 దూసుకెళ్లి రూ. 69,797 వద్ద ముగిసింది. వెరసి నేటి ట్రేడింగ్‌లోనూ పసిడి ధరలు హైజంప్‌ చేయనున్నట్లు కమోడిటీ నిపుణులు చెబుతున్నారు.

ర్యాలీ బాటలోనే
ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి(అక్టోబర్‌ ఫ్యూచర్స్‌) రూ. 219 పుంజుకుని రూ. 54,770 వద్ద ట్రేడవుతోంది. సెప్టెంబర్ ఫ్యూచర్స్‌ వెండి కేజీ ధర సైతం రూ. 64 బలపడి రూ. 69,861 వద్ద కదులుతోంది.

2500 డాలర్లకు
సమీప భవిష్యత్‌లో ఔన్స్‌ పసిడి 2500 డాలర్లను తాకే వీలున్నట్లు యూఎస్‌కు చెందిన  బులియన్‌ సాంకేతిక విశ్లేషకులు విడ్మర్‌, ఫ్రాన్సిస్కో బ్లాంచ్‌ అభిప్రాయపడ్డారు. బంగారానికి అత్యంత కీలకమైన 2000 డాలర్ల రెసిస్టెన్స్‌ను భారీ ట్రేడింగ్‌ పరిమాణంతో అధిగమించడంతో ఇకపై మరింత జోరందుకునే వీలున్నట్లు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. రానున్న 18 నెలల కాలంలో బంగారం ఔన్స్‌ ధర 3,000 డాలర్లకు చేరవచ్చని బీవోఎఫ్‌ఏ గ్లోబల్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. కోవిడ్‌-19  ప్రపంచ దేశాలన్నిటా వేగంగా విస్తరిస్తుండటం, కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడం వంటి అంశాలు బంగారానికి డిమాండ్‌ పెంచుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top