యువ పారిశ్రామికవేత్తలు ఎంతో స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక్క విభాగానికి పరిమితం కాకుండా ఒకటికి మించిన ఆదాయ మార్గాలతో విజయాల మోత మోగిస్తున్నారు. దాదాపు 75 శాతం మంది జెన్ జెడ్ పారిశ్రామికవేత్తలు (1997–2012 మధ్య జన్మించిన వారు) ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులను కలిగి ఉన్నట్టు లింక్డ్‌ఇన్ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం..
పాత తరంతో పోలిస్తే నేటి యువత మరింత సరళతర పని నమూనాల వైపు అడుగులు వేస్తున్నారు. జెన్ జెడ్‌లో ప్రతీ నలుగురిలో ముగ్గురు (75 శాతం) తమకు ఒకటికి మించి ఆదాయ వనరులున్నట్టు చెప్పారు.
జెన్ ఎక్స్ (1965–1980 కాలంలో జన్మించిన వారు)లో కేవలం 62 శాతం మందికి మాత్రమే ఒకటికి మించిన ఆదాయ వనరులు ఉన్నాయి.
వృత్తిపై పూర్తి నియంత్రణ సాధించడంతో పాటు, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ తరం తమ కెరీర్‌ను మలుచుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వ్యాపార ధోరణులకు భారత్ నిదర్శనంగా నిలుస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. గడిచిన ఏడాది కాలంలో భారత్‌లో తమ ప్రొఫైల్‌లో ‘వ్యవస్థాపకుడు’ అని జోడించుకున్న వారి సంఖ్య 104 శాతం పెరిగింది. ఏ ఇతర దేశంతో పోల్చినా భారత్‌లోనే ఇది అధికమని ఈ నివేదిక తెలిపింది.
500 మంది చిన్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధిలోని వారిని ప్రశ్నించి లింక్డ్‌ఇన్ ఈ వివరాలు రూపొందించింది.
వ్యయాలు, అనుభవం లేకపోవడం వంటి సంప్రదాయ అవరోధాలను ఏఐ, డిజిటల్ టూల్స్ తగ్గిస్తున్నాయి. దీని వల్ల వ్యాపారం ప్రారంభించడం కొత్త తరానికి సులభతరంగా మారింది.
85 శాతం మంది యువ వ్యవస్థాపకులు తమ వ్యాపార వృద్ధికి ఏఐ ఎంతో కీలకమని భావిస్తున్నారు.
తమ నేపథ్యంతో సంబంధం లేకుండా పారిశ్రామికేవేత్తలుగా అవతరించే అవకాశాలు ప్రస్తుం ఉన్నట్టు 80 శాతం మంది చెప్పారు. గతంతో పోలి్చతే నేడు మరింత సులభతరం అయినట్టు 81 శాతం మంది తెలిపారు.
భారత్‌లో జెన్‌జెడ్ విజయం అంటే కేవలం డబ్బు అనుకోవడం లేదు. 64 శాతం మంది స్వేచ్ఛ, సౌలభ్యం, 56 శాతం వ్యక్తిగత అభివృద్ధి, 55 శాతం మంది ఆర్థిక సంపదను నిజమైన విజయంగా భావిస్తున్నారు. వీటిని సాధించేందుకు రిస్క్ తీసుకునేందుకూ వెనుకాడడం లేదు.
ఏఐతో అందరికీ అవకాశాలు..
‘‘ఒకప్పుడు అసాధ్యం అనుకున్న వ్యాపార కలలను నేడు ఏఐ నిజం చేస్తోంది. ఒకే ఉద్యోగానికి పరిమితం కాకుండా, రకరకాల ఆదాయ మార్గాలను సృష్టించుకునేందుకు, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోంది’’ అని లింక్డ్‌ఇన్ భారత మేనేజర్ కుమారేష్ పట్టాభిరామన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన


