నిప్పన్‌ ఇండియా గ్రోత్‌ ఫండ్‌ రివ్యూ

Details About Nippon India Growth Fund - Sakshi

ఈక్విటీ మార్కెట్లలో రిస్క్‌ అన్నది దీర్ఘకాలంలో (కనీసం 5–10 ఏళ్లు) దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలంలో నష్టాలను ఇవ్వడం చాలా అరుదు. ఒకవేళ పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత చివర్లో మార్కెట్లు కుప్పకూలితే.. అప్పడు లాభాలు అడుగంటిపోవచ్చు. లేదా నష్టాలు కనిపించొచ్చు. కానీ ఇన్వెస్టర్‌ అప్పటి నుంచి మరో రెండేళ్లపాటు తన పెట్టుబడులను కొనసాగించుకుంటే ఊహించని భారీ రాబడులు సమకూరతాయి. మార్కెట్ల తీరు ఇలానే ఉంటుంది. అందుకనే దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేసుకునే వారు ఈక్విటీల్లో రిస్క్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పైగా అచ్చం లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే కొంత భాగాన్ని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ పథకాలకు కూడా ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. నిప్పన్‌ ఇండియా గ్రోత్‌ ఫండ్‌ ఓపెన్‌ ఎండెడ్‌ మిడ్‌క్యాప్‌ పథకం. అధికంగా వృద్ధిని సాధించే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడులను అందించడం పథకం ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది 

పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో 
ఈ పథకం పెట్టుబడులకు సంబంధించి బోటమ్‌ అప్‌ విధానాన్ని అనుసరిస్తుంది. లేదా స్టాక్‌ వారీగా పెట్టుబడుల విధానాన్ని ఆచరిస్తుంది. సహేతుక విలువ వద్ద లభిస్తూ, వృద్ధికి అవకాశాలున్న స్టాక్స్‌ను ఎంపిక చేసుకుంటుంది. ప్రధానంగా మిడ్‌క్యాప్‌ కంపెనీలకే ఎక్కువ కేటాయింపులు చేస్తుంది. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కు 70 శాతం వరకు పెట్టుబడులను కేటాయిస్తుంటుంది. మిగిలిన మేర నిధులను లార్జ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌నకు కేటాయించడాన్ని గమనించొచ్చు. అంటే ఈ పథకం ద్వారా మిడ్‌క్యాప్‌తోపాటు లార్జ్, స్మాల్‌క్యాప్‌ విభాగంలోనూ కొంత ఎక్స్‌పోజర్‌ లభిస్తుంది. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా 3–8 శాతం మధ్య నగదు నిల్వలను ఈ పథకం కొనసాగిస్తుంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.11,573 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 93.6 శాతం పెట్టుబడులను స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే, మిగిలిన మేర నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 86 స్టాక్స్‌ ఉన్నాయి. ప్రస్తుతానికి మిడ్‌క్యాప్‌ పెట్టుబడులు 68 శాతంగా ఉంటే, లార్జ్‌క్యాప్‌లో 23 శాతం, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో 8.5 శాతం వరకు పెట్టుబడులు పెట్టి ఉంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగాలకు చెందిన కంపెనీలకు 22 శాతం కేటాయింపులు చేసింది. సేవల రంగ కంపెనీలలో 11 శాతం, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో 10 శాతం, నిర్మాణ రంగ కంపెనీలలో 8 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. 

రాబడులు  
ఈ పథకంలో ఏ కాలంలో చూసినా కానీ సగటు రాబడులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 1995 అక్టోబర్‌లో ఈ పథకం మొదలు కాగా.. నాటి నుంచి చూసుకుంటే సగటు వార్షిక రాబడి ఇప్పటి వరకు ఏటా (ట్రెయిలింగ్‌ రాబడులు) 22.55 శాతం చొప్పున ఉండడం గమనార్హం. గత రెండు దశాబ్దాల కాలంలో మంచి సంపద సృష్టించిన పథకంగా చెప్పుకోవాలి. గడిచిన ఏడాది కాలంలో పెట్టుబడులపై 42 శాతం ప్రతిఫలాన్నిచ్చింది. మూడేళ్ల కాలంలో 25 శాతం, ఐదేళ్లలో 19.69 శాతం, ఏడేళ్లలో 15.91 శాతం, పదేళ్లలో 18.79 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది.  

చదవండి: మ్యూచువల్‌ ఫండ్‌ పథకానికి, న్యూ ఫండ్‌ ఆఫర్‌ల మధ్య తేడా ఏంటి?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top