
ముంబై : స్టాక్ మార్కెట్‌కి నష్టాల తప్పడం లేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి నవంబరు వరకు దాదాపు బుల్ రన్ కొనసాగింది. దాదాపు పది వేల పాయింట్లకు పైగా పైకి చేరుకుంది సెన్సెక్స్. కానీ నవంబరులో ఒడిదుడుకులు మొదలయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతుండటంతో 60 వేల పాయింట్ల దగ్గర సెన్సెక్స్, 18 వేల పాయింట్ల దగ్గర నిఫ్టీకి తీవ్ర నిరోధత ఎదురవుతోంది.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈలో సెన్సెక్స్ ప్రారంభం కావడమే 60 వేలకు దిగువన 59,960 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత కొద్ది సేపటికి పాయింట్లు పుంజుకుని 60 వేలు దాటినా ఎక్కువ సేపు అక్కడ నిలబడలేకపోయింది. ఉదయం 10 గంటల సమయంలో 102 పాయింట్లు నష్టపోయి 59,906 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ తొలి అరగంట లాభాల్లో ఉన్నా క్రమంగా నష్టాలపాలైంది. 48 పాయింట్లు నష్టపోయి 17.850 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇండియా వీఐఎక్స్, ఐటీసీ షేర్లు లాభాలు పొందగా ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, టైటాన్ షేర్లు నష్టపోయాయి.