పత్తి వంటి కీలక ఉత్పత్తుల రవాణా (షిప్‌మెంట్‌లు)లో తగ్గుదల కారణంగా టెక్స్‌టైల్స్, గార్మెంట్ ఎగుమతులు 2025–26లో 2.2% తగ్గి 35.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్‌ఐ) ఈ విషయాలు వెల్లడించింది. రూపాయిపరంగా కూడా గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 2.1% తగ్గాయి.
ఆర్థిక సంవత్సరంలో పత్తి టెక్స్‌టైల్స్ (–3.9%), రెడీమేడ్ దుస్తులు (–1.4%), కార్పెట్లు (–5.3%) వంటి ప్రధాన విభాగాల్లో తగ్గుదల ధోరణి కనిపించింది. అయితే హస్తకళల ఎగుమతులు మాత్రం స్వల్పంగా 1.5% పెరిగాయి. ‘‘రూపాయి, డాలర్ మారకం వృద్ధిలో వ్యత్యాసం ఒక వ్యవస్థాత్మక సమస్యకు సంకేతం.
భారత్ విలువపరంగా ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా డాలర్ల రూపంలో తక్కువ ఆదాయం ఆర్జిస్తోంది. ఉదాహరణకు, మ్యాన్–మేడ్ టెక్స్‌టైల్స్ రూపాయి పరంగా 3.6% పెరిగినా, డాలర్ పరంగా 0.8% తగ్గాయి. అలాగే, గార్మెంట్స్ ఎగుమతులు రూపాయి పరంగా 2.9% పెరిగినా, డాలర్ పరంగా 1.4% క్షీణించాయి’’ అని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.
కరెన్సీ క్షీణత వల్లే వృద్ధి కనిపిస్తోందే తప్ప పోటీ సామర్థ్యాల వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి కీలకమైన గ్లోబల్ మార్కెట్లలో భారత్ విస్తరించలేకపోవడమో, లేదా మార్కెట్ వాటాను కోల్పోవడమో జరుగుతోందని, ముఖ్యంగా కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రంగాల్లో ఇది ప్రస్ఫుటంగా ఉంటోందని వివరించారు.


