కమర్షియల్‌ వాహనాలు జోరుగా.. హుషారుగా! తగ్గేదెలే!!

commercial vehicle industry sales growth to be in double digits: Tata Motors - Sakshi

వాణిజ్య వాహనాలు రెండంకెల స్థాయి వృద్ధి

టాటా మోటర్స్‌ ఈడీ గిరీష్‌ వాఘ్‌ అంచనా

న్యూఢిల్లీ: వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం ప్రతికూలమే అయినప్పటికీ ఈ ఏడాది వాణిజ్య వాహనాల (సీవీ) అమ్మకాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు టాటా మోటర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిరీష్‌ వాఘ్‌ తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం అలాగే వడ్డీ రేట్ల పెరుగుదల వంటి ప్రతికూలతలను అధిగమించేలా మౌలికసదుపాయాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుండటం, దేశీయంగా వినియోగం క్రమంగా పెరుగుతుండటం తదితర సానుకూలాంశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

రవాణా రేట్లు, వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతుండటమనేది రవాణాదారుల విశ్వాస సూచీ మెరుగుదలకు తోడ్పడుతున్నాయని వాఘ్‌ వివరించారు. తమ కంపెనీ విషయానికొస్తే లాభదాయకత వృద్ధిపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నామని, ఎప్పట్లాగే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం పండుగ సీజన్‌ నుండి డిమాండ్‌ పుంజుకోగలదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.  

దేశీ ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సమాఖ్య (సియామ్‌) గణాంకాల ప్రకారం 2022-23 తొలి త్రైమాసికంలో దేశీయంగా సీవీల విక్రయాలు 112 శాతం పెరిగి 1,05,800 యూనిట్ల నుంచి 2,24,512 యూనిట్లకు పెరిగాయి. 2021-22లో అమ్మకాలు 26 శాతం వృద్ధి చెంది 5,68,559 యూనిట్ల నుంచి 7,16,566 యూనిట్లకు పెరిగాయి. వడ్డీ రేట్ల పెంపుతో ఈఎంఐల భారం పెరుగుతుందని, అయితే ఇది మరీ ఎక్కువగా ఉండకుండా చూసేలా తగు ఫైనాన్సింగ్‌ స్కీమ్‌లు లభించే విధంగా ఆర్థిక సంస్థలతో కలిసి పరిశ్రమ ప్రయత్నాలు చేస్తోందని వాఘ్‌ చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top