ఈజీఆర్‌ విభాగం ఏర్పాటు దిశలో బీఎస్‌ఈ అడుగులు

BSE collaborates with 4 regional associations to promote EGRs - Sakshi

నాలుగు ప్రాంతీయ అసోసియేషన్లతో భాగస్వామ్యం

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసిప్ట్స్‌ (ఈజీఆర్‌) విభాగం ఏర్పాటు దిశలో బాంబే స్టాక్‌ ఎక్సే్చంజ్‌ (బీఎస్‌ఈ) కీలక అడుగులు వేసింది. ఈ ప్రొడక్ట్‌ను ప్రమోట్‌ చేయడానికి మహారాష్ట్ర, తమిళనాడు నుంచి నాలుగు ప్రాంతీయ అసోసియేషన్లతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో బీఎస్‌ఈ తెలిపింది. వీటిలో తిరునెల్వేలి గోల్డ్‌ సిల్వర్‌ డైమండ్‌ జ్యువెలరీ ట్రేడర్స్‌ అసోసియేషన్, నాందేడ్‌ సరాఫా అసోసియేషన్, సరాఫ్‌ సువర్‌కర్‌ సంత్నా పూసద్, ఘడ్చిరోలి జిలా సరాఫా అసోసియేషన్‌లు ఇందులో ఉన్నాయి.

వీటిలోని దాదాపు 1,000 మంది సభ్యులు జ్యూయలరీ, బులియన్‌ ట్రేడ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ భాగస్వామ్యాలతో దేశీయ, అంతర్జాతీయ జోన్‌లలో శక్తివంతమైన గోల్డ్‌ ఎక్సే్చంజ్‌ని అభివృద్ధి చేయడంలో పరివర్తనాత్మక పాత్రను పోషించగలదనే విశ్వాసాన్ని బీఎస్‌ఈ వ్యక్తం చేసింది.  ఈజీఆర్‌ సెగ్మెంట్‌ ఏర్పాటుకు కొద్ది రోజుల క్రితమే బీఎస్‌ఈకి మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ నుంచి అనుమతి లభించిన సంగతి తెలిసిందే.   భారత్‌లో గోల్డ్‌ ఎక్సే్చంజ్‌ల ఏర్పాటుకు వీలుగా వాల్డ్‌ మేనేజర్స్‌ నిబంధనావళిని కూడా సెబీ ఇటీవలే నోటిఫై చేసింది. గోల్డ్‌ ఎక్సే్చంజ్‌ల్లో  ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసిప్ట్స్‌ (ఈజీఆర్‌) రూపంలో బంగారం ట్రేడింగ్‌ జరుగుతుంది.

ఈజీఆర్‌ను బాండ్‌గా పరిగణిస్తారు.  సంబంధిత ఈజీఆర్‌లు ఇతర సెక్యూరిటీల మాదిరిగానే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్‌మెంట్, ఫిజికల్‌ డెలివరీ ఫీచర్‌లను కలిగి ఉంటాయి. పసిడి విషయంలో అంతర్జాతీయంగా భారత్‌ రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉన్న నేపథ్యంలో ఈ యల్లో మెటల్‌కు సంబంధించి లావాదేవీల్లో పారదర్శకను పెంపొందించడం,  పటిష్ట స్పాట్‌ ధరల నిర్ధారణ యంత్రాంగం ఆవిష్కరణ వంటి అంశాల్లో గోల్డ్‌ ఎక్సే్చంజ్‌ కీలక పాత్ర పోషిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  గోల్డ్‌ ఎక్సే్ఛంజ్,  వేర్‌హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేటరీ అథారిటీ (డబ్లు్యడీఆర్‌ఏ)లకు సెబీ నియంత్రణ సంస్థగా ఉంటుందని 2021–22 బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top