ఓలా సంచలనం: ప్రపంచంలోనే బిగ్గెస్ట్‌ ఈవీ హబ్‌, భారీ పెట్టుబడులు

Bhavish Aggarwal tweets Rs 7K cr invest in TN to electric cars lithium ion cells - Sakshi

చెన్నై: ఓలా సీఈవోభవిష్‌ అగర్వాల్‌  వ్యాపార విస్తరణలో దూసుకుపోతున్నారు.  ముఖ్యంగా  ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న  ఓలా తాజాగా మరో అడుగుముందుకేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద EV హబ్‌ను ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ కార్లు, లిథియం-అయాన్ సెల్‌లను తయారు చేసేందుకు ఓలా రూ.7,614 కోట్ల పెట్టనుంది. ఇందుకోసం  తమిళనాడు ప్రభుత్వం ఎంఓయూ కూడా కుదుర్చుకుంది.  ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా  ఈ విషయాన్ని వెల్లడించారు.  ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తన అనుబంధ కంపెనీలైన ఓలా సెల్ టెక్నాలజీస్ (OCT) , ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ (OET) ద్వారా  ఒక ఒప్పందంపై సంతకం చేసారని శనివారం ట్వీట్‌ చేశారు.

(ఇవీ చదవండి:  ఎయిరిండియా మెగా డీల్‌: 2 లక్షలకు పైగా ఉద్యోగాలు)
(భారీగా లిథియం నిక్షేపాలు: ఇక భవిష్యత్తంతా అద్భుతమే! ఆనంద్‌ మహీంద్ర
)

తమిళనాడులో టూ వీలర్, కార్ల  లిథియం సెల్ గిగాఫ్యాక్టరీలతో ప్రపంచంలోనే అతిపెద్ద EV హబ్‌ను ఏర్పాటు చేస్తుంది. తమిళనాడుతో ఈరోజు ఎంఓయూపై సంతకం చేశామని భవిష్‌  వెల్లడించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అగర్వాల్ మధ్య ఒప్పందం కుదిరిందంటూ ఒక ఫోటోను కూడా షేర్‌ చేశారు. కృష్ణగిరి జిల్లాలో ఈ 20 గిగా వాట్ల బ్యాటరీ తయారీ యూనిట్ఏర్పాటు  కానుంది.  మొత్తం పెట్టుబడిలో దాదాపు రూ.5,114 కోట్లు సెల్ తయారీ ప్లాంట్‌లోకి, మిగిలిన రూ.2,500 కోట్లు కార్ల తయారీ యూనిట్‌లోకి వెళ్తాయి.

సంవత్సరానికి 140,000 ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లను ఉత్పత్తి చేయడానికి ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. 2024 నాటికి కార్లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే దాదాపు 500కిలోమీటర్ల రేంజ్‌తో కారును తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ 2024 నాటికి ఫోర్-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు) ప్రారంభించాలనే ప్రణాళికను మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో తాజా డీల్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది.  ఈ పెట్టుబడుదల ద్వారా 3,111 ఉద్యోగాలను సృష్టించనుందట. 

తమిళనాడు కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ డీల్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆటో హబ్‌గా ఉన్న తమిళనాడులో హోసూర్‌లోని కంపెనీ ప్రస్తుత సౌకర్యం ప్రపంచంలోనే అతిపెద్దఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్‌లలో ఒకటి అని తమిళనాడు ప్రభుత్వపెట్టుబడి ప్రమోషన్ ఏజెన్సీ గైడెన్స్ తమిళనాడు  సీఎండీ  విష్ణు అన్నారు. 

తమిళనాడు ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ 2023 ప్రకారం రాష్ట్ర వస్తువులు, సేవల పన్ను (SGST), పెట్టుబడి లేదా టర్నోవర్ ఆధారిత సబ్సిడీ , అధునాతన కెమిస్ట్రీ సెల్ సబ్సిడీ 100 శాతం రీయింబర్స్‌మెంట్ ఉన్నాయి. తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ నుండి కొనుగోలు చేసే విద్యుత్‌పై ఐదేళ్లపాటు విద్యుత్ పన్నుపై 100 శాతం మినహాయింపు, స్టాంప్ డ్యూటీపై మినహాయింపు ,భూమి ధరపై సబ్సిడీని కూడా రాష్ట్రం అందిస్తుంది. గత ఐదేళ్లలో,  ఈవీ సె క్టార్‌లో 48,000 ఉద్యోగాల ఉపాధి అవకాశాలతో కూడిన ప్రాజెక్టులను సాధించింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top