పెరుగుతున్న వడ్డీ రేట్లు.. ఇక్కడ ఇన్వెస్ట్‌ చేస్తే లాభాలే!

Best Investment Tips To Investors By Value Research Ceo - Sakshi

నాకు పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్‌సీఎస్‌ఎస్, పీఎంవీవై పథకాల్లో పెట్టుబడులు ఉన్నాయి. నా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) ఒకటి గడువు తీరడంతో కొంత మొత్తం చేతికి వచ్చింది. వడ్డీ రేట్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకుంటే మెరుగైన రాబడులు వస్తాయి?

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో రాబడులు మెరుగ్గా ఉండవు. కనుక మీరు మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎఫ్‌డీలతో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్‌ అస్థిరతలతో ఉంటాయి. అచ్చమైన ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే ఆటుపోట్లు తక్కువే. ఇవి 15–30 శాతం వరకు ఈక్విటీల్లో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల్లో, ఆర్బిట్రేజ్‌ ట్రేడింగ్‌ అవకాశాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి.

స్వల్పకాలానికి ఈ ఫండ్స్‌లోనూ రిస్క్‌ ఉంటుంది. మూడు నుంచి ఐదేళ్లు అంతకుమించిన కాలానికి రిస్కీ అని నేను అనుకోను. షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ను కూడా పరిశీలించొచ్చు. షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ రాబడులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో మాదిరే ఉంటాయి. కాకపోతే వీటిల్లో లిక్విడిటీ ఎక్కువ. పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్‌సీఎస్‌ఎస్, పీఎంవీవీవై పథకాల్లో పెట్టుబడులు ఉండడంతో, వాటి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం వస్తుంటుంది. ఈ పథకాల నుంచి రాబడి తీసుకుంటూ ఉంటారు కనుక పెట్టుబడి విలువ పెరగదు. కనుక మీకు ఉన్న వాటిల్లో ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ మెరుగైన ఆప్షన్‌ అవుతుంది. ఈక్విటీ వద్దనుకుంటే షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌కు వెళ్లొచ్చు.

నా వయసు 45 ఏళ్లు. నా విశ్రాంత జీవనం కోసం వచ్చే పదేళ్ల పాటు, ప్రతి నెలా రూ.50,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేయాలన్నది నా ప్రణాళిక. ఏ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి?

రిటైర్మెంట్‌ కోసం పొదుపు చేసుకోవాలనుకునే వారు వాస్తవికంగా ఆలోచించాల్సిందే. ముందుగా రిటైర్మెంట్‌ కోసం ఎంత మొత్తం కావాలన్నది నిర్ణయించుకోవాలి. రిటైర్మెంట్‌ నాటికి ఎంత నిధి సమకూర్చుకోగలరో అవగాహనకు రావాలి. విశ్రాంత జీవన అవసరాలకు కావాల్సినంత మీరు కూడబెట్టే విధంగా ప్రణాళిక ఉండాలి. రెండు నుంచి మూడు వరకు మంచి ఫ్లెక్సీక్యాప్‌ పథకాలను ఎంపిక చేసుకోవాలి. నెలవారీ సిప్‌ ద్వారా వాటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. మరో పదేళ్ల పాటు మీ కెరీర్‌ కొనసాగనుంది. కనుక మీ పెట్టుబడి వృద్ధి చెందడానికి తగినంత వ్యవధి మిగిలి ఉంది. ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులకు సంబంధించి అవగాహన లేకపోతే, అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే కొంచెం తక్కువ అస్థిరతలతో ఉంటాయి. అలాగే రిటైర్మెంట్‌ కోసం ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పథకాలు, ఈక్విటీ పథకాలను ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత.. ఈక్విటీ పెట్టుబడులను ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పథకాల్లోకి మార్చాల్సిన అవసరం ఏర్పడదు. ఎందుకంటే సగం పెట్టుబడులు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ (డెట్‌ ఫండ్స్‌) సాధనాల్లోనే ఉంటాయి. ఈక్విటీ, డెట్‌ మధ్య పెట్టుబడుల కేటాయింపు జాగ్రత్తగా ఉండాలి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేలా, వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాలపై పడే ప్రభావాన్ని అధిగమించేలా ఈ సమతూకం ఉండాలి.

చదవండి: ఇది మరో కేజీఎఫ్‌.. రియల్‌ ఎస్టేట్‌ సంపాదన, భవనం మొత్తం బంగారమే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top