
ఇండియా దశ దిశను మార్చిన తెలుగు తేజం, మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు సెల్యూట్ కొట్టారు ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా. పీవీ నర్సింహరావు జయంతిని పురస్కరించుకుని ఆయన ట్విటర్‌లో స్పందించారు. పీవీ ఎంతో ధైర్యంతో 1991లో అమలు చేసిన ఆర్థిక సంస్కరణ వల్లనే దేశం నేడు ఈ స్థితిలో ఉందంటూ ఆయన కొనియాడారు.
లైసెన్స్ రాజ్ వ్యవస్థ బలంగా ఉండటం, విదేశీ మారక ద్రవ్యం నిధులు అడుగంటి పోవడంతో 1991 నాటికి భారత్ ఆర్థికంగా గడ్డు పరిస్థితులకు ఎదుర్కొంటోంది. ఆ సమయంలో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు సాహసోపేతంగా ఆర్థిక సంస్కరణలు అమలు చేశారు. ఆనాటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌తో కలిసి రూపాయి విలువ తగ్గించడం, స్వేచ్ఛ వాణిజ్యం, లైసెన్స్ రాజ్‌కి చరమగీతం పాడారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఫలితంగా భారత్ నేడు ఆర్థికంగా ఒడిదుడుకులు లేని స్థితికి చేరుకోగలిగింది.