ఏజీఆర్‌ లెక్కింపుపై టెల్కోలకు ఊరట

Airtel opts for 4-year moratorium on payment of AGR, spectrum dues: - Sakshi

న్యూఢిల్లీ: టెలికం సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించే దిశగా లైసెన్స్‌ నిబంధనలను కేంద్రం సవరించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) లెక్కించే విధానంలో మార్పులు చేసింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల విధింపునకు సంబంధించి టెలికంయేతర ఆదాయాలు, డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం మొదలైన వాటిని ఏజీఆర్‌ నుంచి మినహాయించింది. ఇకపై టెల్కోల స్థూల ఆదాయం నుంచి ముందుగా వీటిని మినహాయిస్తారు.

ఆ తర్వాత మిగిలే మొత్తం నుంచి ఇప్పటికే మినహాయింపులు అమలవుతున్న రోమింగ్‌ ఆదాయాలు, ఇంటర్‌కనెక్షన్‌ చార్జీల్లాంటి వాటిని తీసివేసి తుది ఏజీఆర్‌ను లెక్కిస్తారు. ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచే ఈ సవరణను వర్తింపచేస్తున్నట్లు టెలికం శాఖ (డాట్‌) తెలిపింది. గత ఏజీఆర్‌ లెక్కింపు విధానం కారణంగా టెల్కోలపై ఏకంగా రూ. 1.47 లక్షల కోట్ల బకాయిల భారం పడుతోంది. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల్లో ఏజీఆర్‌ సవరణ కూడా ఒకటి.  

‘మారటోరియం’కు ఎయిర్‌టెల్‌ ఓకే!
సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌), స్పెక్ట్రమ్‌ బకాయిల చెల్లింపుపై నాలుగు సంవత్సరాల మారటోరియం తనకు అంగీకారమేనని భారతీ ఎయిర్‌టెల్‌ ప్రభుత్వానికి తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెలికం రంగానికి ఇటీవల ప్రకటించిన సహాయక ప్యాకేజీలో భాగంగా  టెల్కోలకు బకాయిలపై మారటోరియం అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top