కంప్యూటర్ పుట్టుకొచ్చిన తొలినాళ్లలో చాలా రంగాల్లో సిబ్బంది అవసరం తగ్గిపోయింది. కానీ అప్పట్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో ఉండటంతో ఆ శ్రమశక్తి ఇతర రంగాల్లోకి మళ్లింది. కానీ నేడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి వేరు. ‘ఏజెంటిక్ ఏఐ’ రూపంలో వస్తున్న సాంకేతిక విప్లవం, అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితులు కలిసి ప్రపంచవ్యాప్తంగా వైట్ కాలర్ ఉద్యోగాలను తుడిచిపెట్టే ప్రమాదం కనిపిస్తోంది.
నిర్ణయం దానిదే.. అమలు దానిదే!
2024లో తెరపైకి వచ్చిన ఏజెంటిక్ ఏఐ కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు, ఒక పనిని ఎలా చేయాలో స్వయంగా నిర్ణయించుకుని పూర్తి చేయగలదు. ఆంత్రోపిక్ క్లాడ్ వంటి టూల్స్ ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో చూస్తుంటే భయం కలగక మానదు. ‘ముందు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ కొన్ని రంగాలు పూర్తిగా కనుమరుగవుతాయి’ అని ఓపెన్ ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్‌మాన్ హెచ్చరించడం గమనార్హం.
ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ అంచనా ప్రకారం.. కోడింగ్, ఫైనాన్స్, లా వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన వారి ఉద్యోగాల్లో 20 శాతం కోత పడే అవకాశం ఉంది. ఇది కేవలం సామాన్య ఉద్యోగులకే కాదు, మధ్యతరగతికి కీలకంగా మారే ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది.
భారత ఐటీ రంగానికి రెడ్ అలర్ట్
భారతదేశం ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్‌గా గుర్తింపు పొందింది. లక్షలాది మంది యువత ఐటీ సేవల ద్వారా ఉపాధి పొందుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
కాగ్నిజెంట్ ఇప్పటికే భారత్‌లో అధిక వాటా ఉండేటా 15,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
సేల్స్‌ఫోర్స్ సంస్థలో సగం సపోర్ట్ సర్వీసులను ఏఐ చూసుకోవడంతో 4,000 ఉద్యోగాల్లో కోత పడింది.
ఫ్రెష్‌వర్క్స్ తన కోడింగ్‌లో సగానికి పైగా ఏఐతో చేయిస్తూ 11 శాతం సిబ్బందిని తగ్గించుకుంది.
డ్యుయోలింగో (ట్రాన్స్‌లేషన్), చెగ్ (ఎడ్యుకేషన్), హెచ్‌పీ వంటి దిగ్గజాలు కూడా ఏఐ కారణంగా సిబ్బందిని తగ్గిస్తున్నాయి.
నందన్ నిలేకని చెప్పినట్లుగా కంపెనీలు ఇప్పుడు ‘టాప్-టు-బాటమ్’ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాయి. గతంలో ఒక పనికి వందల మంది ఇంజినీర్లు అవసరమయ్యే వారు. ఇప్పుడు ఏఐ సాయంతో చిన్న టీమ్‌లు అదే పనిని నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి.
యుద్ధ క్షేత్రంలోనూ రోబోలదే రాజ్యం
సాంకేతికత కేవలం ఆఫీసులకే పరిమితం కాలేదు. రక్షణ రంగాన్ని కూడా మార్చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు, అటానమస్ రోబోల వినియోగం పెరిగింది. చైనా తన విమాన దళంలో మానవరహిత విమానాలను ప్రవేశపెడుతోంది. దీనిని గమనించిన భారత్ కూడా అప్రమత్తమైంది.
బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డ్రోన్ లాబొరేటరీలను ఏర్పాటు చేసింది. ఐఐటీల సహకారంతో విద్యార్థులకు, గ్వాలియర్ వంటి కేంద్రాల్లో సైనికులకు డ్రోన్ ఆపరేటింగ్, డిఫెన్స్‌లో శిక్షణ ఇస్తున్నారు.
భారత్ ముందున్న సవాలు
ఒకవైపు శ్రమశక్తి విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు శ్రమను నిర్వహించే ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు ఏఐ వల్ల ఆవిరవుతున్నాయి. ఒకప్పుడు అవుట్‌సోర్సింగ్ ద్వారా భారత్‌కు వచ్చే కాంట్రాక్ట్‌లు ఇప్పుడు ఆయా దేశాల్లోనే ఏఐ సాఫ్ట్‌వేర్‌ల ద్వారా పూర్తవుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం వైట్ కాలర్ ఉద్యోగులు తమ నైపుణ్యాలను అత్యున్నత స్థాయికి పెంచుకోకపోతే ప్రమాదంలో పడతారని గ్రహించాలి.
ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు


