మహిళలకు ‘లీడర్‌షిప్‌’.. ఆదిత్య బిర్లా కొత్త ప్రోగ్రామ్‌ | Aditya Birla Capital Empowers Women Entrepreneurs Launches Leadership Program | Sakshi
Sakshi News home page

మహిళలకు ‘లీడర్‌షిప్‌’.. ఆదిత్య బిర్లా కొత్త ప్రోగ్రామ్‌

Apr 17 2026 9:21 PM | Updated on Apr 17 2026 9:25 PM

Aditya Birla Capital Empowers Women Entrepreneurs Launches Leadership Program

ముంబై: ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ లిమిటెడ్‌ (ఏబీసీఎల్‌), తన ఫిన్‌టెక్‌ విభాగం ఇన్ఫినైట్‌ కింద మహిళల కోసం మహిళలే నిర్వహించే ‘లీడర్‌షిప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్థిక సేవలు ఫిన్‌టెక్‌ రంగాల్లో ప్రారంభ దశలో ఉన్న మహిళా వ్యాపారవేత్తలకు దీని కింద మద్దతు ఇస్తుంది. అలాగే, వారికి అవసరమైన వనరులు అందించడంతోపాటు వేగంగా తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు, వ్యాపార విస్తరణకు స్థిరమైన అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సంస్థ ప్రకటించింది.

ఈ 'లీడర్‌షిప్‌' కార్యక్రమం ద్వారా ఎంపికైన మహిళా పారిశ్రామికవేత్తలకు ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లోని అగ్రశ్రేణి నిపుణుల నుండి ప్రత్యక్ష పర్యవేక్షణ (Mentorship) లభిస్తుంది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, మార్కెట్ యాక్సెస్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్కింగ్ అవకాశాలను కల్పించడం ద్వారా వారి స్టార్టప్‌లను విజయవంతమైన సంస్థలుగా తీర్చిదిద్దనున్నారు. ముఖ్యంగా ఫిన్‌టెక్ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో లింగ వివక్షను తొలగించడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని ఏబీసీఎల్ ప్రతినిధులు పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఈ వేదిక ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించడానికి, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వీలవుతుంది. వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించడం ద్వారా వ్యాపార నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా వారిని సిద్ధం చేస్తారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, సుస్థిరమైన, సమ్మిళిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఈ ముందడుగు వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement