సూపర్‌బజార్(కొత్తగూడెం): సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సర్ కారణంగానే గత ఎన్నికల్లో కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు ఇంటికి పోయారని రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో గురువారం జరిగిన నియోజకవర్గస్థాయి బీఎల్‌ఏల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సర్ పేరుతో భారీ ఎత్తున ఓట్లను తొలగించే కార్యక్రమం చేపడుతోందని అన్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఓట్లను తొలగించి అక్కడ ప్రభుత్వాలను చేతిలోకి తీసుకుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని విమర్శించారు. ప్రతీ కార్యకర్త అవగాహన పెంచుకుని, అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్కామ్‌ల పార్టీగా మారిందని, ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ బూత్ లెవల్ ఏజెంట్లు ఓటర్ల జాబితాను పరిశీలించి ఎవరి ఓటూ తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, దిండిగల రాజేందర్ వనమా రాఘవేంద్రరావు, కాపు సీతామహాలక్ష్మి, కార్పొరేటర్లు సింధూ తపస్వి, మధు చంద్, గుణచరిత్, రాంబాబు, సాగర్, వేల్పుల దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
కండువా గులాబీ.. మద్దతు హస్తానికి
బీఆర్‌ఎస్ నాయకులమని చెప్పుకుంటూ కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్‌రావులు సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు. ఓ మంత్రి నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తయితే, కొందరు బీఆర్‌ఎస్ నేతలు వేడుకలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మరికొందరు నేతలు గులాబీ పార్టీలో ఉంటూ మంత్రి పొంగులేటికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాంటి వారిని ఇకపై ఉపేక్షించబోమన్నారు. బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) పార్టీ పెట్టిన రోజు పార్టీలో పెద్ద నాయకులెవరు లేరని, మళ్లీ ఒంటరిగానైనా నిఖార్సైన కార్యకర్తలతో కలిసి నడక సాగించేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌తో కొట్లాడటం బీఆర్‌ఎస్‌కు పెద్ద విషయం కాదని, కానీ ప్రస్తుతం ఉన్నది కూటమి కాంగ్రెస్ అని, టీడీపీ వాళ్లు కాంగ్రెస్ ముసుగులో ఉన్నారని పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్‌ను సమర్థంగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు.
టీ కప్పులో తుపాను
సర్ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మాజీ మంత్రి కుమారుడు వనమా రాఘవ కృషి చేయాలని, అయితే ఆయన తన పనితీరును మార్చుకోవాలని రవీందర్‌రావు పలుమార్లు సూచించారు. దీంతో రాఘవ నొచ్చుకోవడంతో ఆయన అభిమానులు రవీందర్‌రావు వ్యాఖ్యల పట్ల అభ్యంతరం తెలుపగా, సమావేశంలో కాసేపు గందరగోళం నెలకొంది. వెంటనే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. అనంతరం కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడమే తమ లక్ష్యమని గులాబీ నాయకులు, కేడర్ ప్రతినబూనడంతో ‘సూచన’ వివాదం టీ కప్పులో తుపానులా ముగిసిపోయింది.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి


