అప్రమత్తంగా ఉండండి..
● మా హయాంలోనే సీతారామ, భక్తరామదాసు ● మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు కూడా ఇచ్చాం ● ఇక్కడి ముగ్గురు మంత్రులు మోసగాళ్లు ● ఎస్‌ఐఆర్‌పై పార్టీ నేతలు, శ్రేణులు అలర్ట్‌గా ఉండాలి ● బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ఖమ్మంరూరల్: ‘కేసీఆర్ నాయకత్వంలో ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. పుష్కర కాలం తర్వాత ఇవాళ ఖమ్మం నుంచి కరీంనగర్ దాకా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఎవరిని కదిలించినా ఎట్లుండే తెలంగాణ .. ఎట్టయిపోయిందనే మాటే వినబడుతుంది. మళ్లీ కేసీఆర్ రావాలి అనే మాట జనంలో నుంచి వస్తోంది. కాంగ్రెస్ పాలనలో ఒకటి, రెండు కాదు అనేక అరాచకాలు జరుగుతున్నాయి. అందుకే కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ మళ్లీ వచ్చేది కేసీఆరే.’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పాలేరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ శ్రేణులకు ‘ఎస్‌ఐఆర్’పై ఖమ్మం రూరల్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఏర్పాటుచేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు.
రైతులకు అండగా ఉన్నాం..
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిందని కేటీఆర్ తెలిపారు. తిరుమలాయపాలెంలోని బీడు భూములకు నీళ్లు ఇచ్చేందుకు భక్తరామదాసు ప్రాజెక్టును తొమ్మిది నెలల్లో పూర్తిచేయగా, సీతారామ ప్రాజెక్టు కూడా 80 శాతం పూర్తి చేశామని చెప్పారు. ఉమ్మడి జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు, రెండు నర్సింగ్ కాలేజీలు మంజూరు చేశామన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన రెండున్నర ఏళ్లలో నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేయగా.. రాష్ట్రానికి, ఉమ్మడి జిల్లాకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు.. ఇలా చెప్పుకుంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి ప్రతీ ప్రాంతానికి చేరాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ ఆగిపోగా, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
ముగ్గురు మంత్రులు చేసిందేమీ లేదు..
ముగ్గురు మంత్రులు ఉమ్మడి జిల్లా నుంచి ఉన్నా ఇక్కడ వారు చేసిందేమీ లేదని పేర్కొన్నారు. ఎవరికి వారు వారి శాఖలను గాలికొదిలేసి కమీషన్లు, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వీరు ముగ్గురు మొనగాళ్లు కాదని, మోసగాళ్లు కావడంతో ఉమ్మడి జిల్లా నలిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పాలేరు, మిగతా నియోజకవర్గాల్లో వస్తున్న స్పందన చూసి దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలని వాళ్లకు అర్థమై ఇష్టారీతిన దోపిడీకి పాల్ప డుతున్నారని విమర్శించారు. దండుపాళ్యం బ్యాచ్‌కు నాయకుడు రేవంత్‌రెడ్డి అయితే, ఇక్కడ ఆయన ముగ్గురు అనుచరులు తిష్టవేశారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా రాక, యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నా మంత్రులకు పట్టడం లేదని పేర్కొన్నారు.
పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌పై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్‌సూచించారు. బూత్‌ల వారీగా బలమైన కేడర్, కమిటీల నిర్మాణం జరగాలన్నారు. అలాగే ఎస్‌ఐఆర్ మ్యాపింగ్, అన్ మ్యాపింగ్ ఓటర్ల జాబితాను బూత్‌ల వారీగా పరిశీలించి.. ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకోవాలని చెప్పారు. పార్టీ పరంగా నియామకం అయ్యే బీఎల్‌ఏలు.. ఎన్నికల సంఘం నియమించే బీఎల్‌ఓలకు సహకారం అందించాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, నేతలు లింగాల కమల్‌రాజ్, రాకేష్‌రెడ్డి, దిండిగల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


