భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి కొలువైన భద్రాచలంలో బుధవారం గిరి ప్రదక్షిణ వైభవోపేతంగా సాగింది. పునర్వసు నక్షత్రం సందర్భంగా దేవస్థానం, కంచర్ల గోపన్న సేవా సమితి సంయుక్త ఆధ్వర్యాన ఈ కార్యక్రమం నిర్వహించగా అర్చకులు, పండితులు, భక్తుల శ్రీరామ నామస్మరణలతో మాఢవీధులు మార్మోగాయి. భక్త రామదాసు విగ్రహానికి పూలమాలలు వేసి హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్‌రావు, స్థానాచార్యులు స్థలశాయి, సిబ్బంది లింగాల సాయిబాబు, కత్తి శ్రీనివాస్, కంచర్ల శ్రీనివాసరావు, భక్తులు పాల్గొన్నారు.
కల్యాణం.. కమనీయం
దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించాక నిత్యకల్యాణ మహోత్సవం పూర్తిచేశారు. కాగా, విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంకు చెందిన హరీశ్‌రావు ఆలయ అవసరాల కోసం కలర్ ప్రింటర్‌ను ఈఓ దామోదర్‌రావుకు అందజేశారు. ఏఈఓ శ్రావణ్‌కుమార్, సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మరింత సమర్థవంతంగా ఆరోగ్య కార్యక్రమాలు
చుంచుపల్లి: జిల్లాలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో పాటు కుష్ఠు వ్యాధి నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయాలని డీఎంహెచ్‌ఓ తుకారామ్ రాథోడ్ ఆదేశించారు. కొత్తగూడెంలోని కార్యాలయంలో బుధవారం ఆయన హెల్త్ ఎడ్యుకేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి అనుమానితులకు పరీక్షలుచేసి, నిర్ధారణ అయి తే చికిత్స తీసుకునేలా చూడాలని చెప్పారు. అంతేకాక వ్యాధిపై ప్రజల్లో అపోహలను తొలగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, చేతబడి, క్షుద్ర పూజలు తదితర మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. ఉద్యోగులు ప్రతాప్, భద్రు, మోహన్, శ్రీనివాస్, జయలక్ష్మి, రమాదేవి, బేబీ, వినయ్‌కుమార్, ప్రతిభ పాల్గొన్నారు.
ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటాం
సూపర్‌బజార్(కొత్తగూడెం): పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ రాజ్ మహమూద్ కుటుంబానికి బుధవారం ఎస్పీ రూ.లక్ష చెక్కు అందజేసి మాట్లాడారు. పోలీసు ఉద్యోగులు తమ ఆరో గ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యాలయ ఏఓ మంజ్యానాయక్, పోలీసు అధికారు ల సంఘం సభ్యుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


