కమనీయంగా రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయంగా రామయ్య కల్యాణం

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణోత్సవాన్ని అర్చకులు పూర్తిచేశారు. మంగళవారం కావడంతో అభయాంజయనేయస్వామి ఉపాలయంలో అభిషేకం, తమలపాకార్చన జరిగాయి.

అత్యవసర వాహనాలు తనిఖీ

ఇల్లెందు: ఇల్లెందు, టేకులపల్లి, గుండాల మండలాల్లోని 102, 108, 1962 (పశువైద్య) వాహనాలను అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు నజీరుద్దీన్‌, సతీశ్‌ వాహనాల్లోని మందుల నిల్వలు, వైద్య పరికరాలు పరిశీలించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేలా ఫోన్‌ రాగానే స్పందించి నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించాలని ఉద్యోగులకు సూచించారు. ఈఎంటీలు, పైలట్లు, సిబ్బంది రేణుకాదేవి, కృష్ణవేణి, అశోక్‌, పారవేట్‌ భరత్‌, ఉదయ్‌, సంజీవ, సునీల్‌, నాగేశ్వరరావు, సాయి, దేవా, వినోద్‌ ఉన్నారు.

సీజనల్‌ వ్యాధుల

కట్టడికి కార్యాచరణ

చుంచుపల్లి: ఆరోగ్య సేవల్లో నాణ్యత పెంపుతోపాటు మాతాశిశు ఆరోగ్యం, సాధారణ ప్రసవాలు, వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ సూచించారు. కొత్తగూడెంలో వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో మంగళవారం సమావేశమైన ఆయన పలు అంశాలపై సమీక్షించారు. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడాన్ని వైద్యాధికారులు బాధ్యతగా భావించాలని తెలిపారు. తల్లిపాల ప్రాముఖ్యతపై గర్భిణులకు అవగాహన కల్పించి బిడ్డ పుట్టాక తల్లిపాలు ఇచ్చేలా ప్రోత్సహించాలన్నారు. అలాగే, ప్రతీ శుక్రవారం డ్రై డే నిర్వహిస్తూ దోమల నివారణ చర్యలను కట్టుదిట్టం చేయాలని, యాంటీ లార్వల్‌ ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో వైద్యులు, ఉద్యోగులు శ్రీధర్‌, సాయి కల్యాణ్‌, ప్రసాద్‌, ప్రతాప్‌, రాందాస్‌, రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.52.95లక్షలు

ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. ఈమేరకు 92 రోజులకు గాను రూ.52,95,430 ఆదాయం నమోదైందని ఈఓ జగన్‌మోహన్‌రావు తెలిపారు. లెక్కింపులో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌తో పాటు శ్రీసత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement