ట్రాక్టర్‌ ట్రాలీతో మోటార్‌ వెలికితీత | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ట్రాలీతో మోటార్‌ వెలికితీత

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

కరకగూడెం: రైతు బావిలో ఇరుక్కుపోయిన మోటార్‌ను ట్రాక్టర్‌ ట్రాలీతో చాకచక్యతంతో వెలికితీశాడు ఓ ఎలక్ట్రీషియన్‌. మండల కేంద్రంలోని ఓ రైతు పొలంలో ఉన్న బోరుబావి లో మోటార్‌ ఇరుక్కుపోవడంతో రైతు ఆందోళనకు గురయ్యాడు. స్థానిక ఎలక్ట్రీషియన్‌ సతీశ్‌ రైతులతో కలిసి ట్రాక్టర్‌ ట్రాలీని పైకి లేపి, మోటార్‌ పైపును గొలుసుతో అనుసంధానం చేసి నెమ్మదిగా పైకి లాగడంతో మోటా ర్‌ బయటకు వచ్చింది. అనంతరం మోటార్‌కు మరమ్మతులు చేసి బోరుబావిలో దించారు. కాగా, సతీశ్‌ను రైతులు అభినందించారు.

నేవీ మార్కోస్‌లో

గుండాల యువకుడు

గుండాల: మండలంలోని నర్సాపురంతండాకు చెందిన బోడా నరేశ్‌నాయక్‌ భారత నావికా దళంలోని మార్కోస్‌ (మైరెన్‌ కమాండో)కు ఎంపికయ్యాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్‌కు దరఖాస్తు చేసుకుని పోటీ పరిక్షల్లో ప్రతిభ కనబర్చి ఎంపికయ్యాడు. శిక్షణలోనూ ఉత్తమ ప్రతిభ కనపర్చిన నరేశ్‌నాయక్‌ మార్కోస్‌కు ఎంపిక కావటంపై తల్లిదండ్రులు శ్రీను – సరోజ హర్షం వ్యక్తం చేశారు. ఒడిశాలో నాలుగు నెలల పాటు శిక్షణ పొందిన ఆయన త్వరలో మార్కోస్‌లో చేరబోతున్నాడని వారు తెలిపారు.

వాతావరణ పరిస్థితులను గమనించాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్‌ సీజన్‌ వ్యవసాయ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో జూన్‌ 8వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో రానున్న రోజుల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాధార పంటల సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నందున రైతులు పత్తి, సోయాబీన్‌, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, ఆముదం వంటి పంటల సాగుకు సిద్ధం కావాలని సూచించారు.

కిన్నెరసానిలో సందడి

పాల్వంచరూరల్‌: ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో సండే సందడి వాతవరణం కన్పించింది. ఆదివారం జిల్లాతోపాటు ఇరుగుపొరుగు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్‌, జలాశయం, డీర్‌ పార్కులోని దుప్పులను వీక్షించారు. 724 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్‌ శాఖకు రూ.38,125 ఆదాయం లభించింది. 400 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్‌ సంస్థకు రూ.25,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

పెట్రోల్‌ బంక్‌ల ఎదుట ఆందోళన..

ఇల్లెందు: వ్యవసాయ అవసరాలకు ట్రాక్టర్ల కోసం డీజిల్‌ తీసుకెళ్లాలని వస్తే క్యాన్లలో పోయడం లేదంటూ ఇల్లెందులో ఆదివారం రాత్రి పలు బంక్‌ల ఎదుట ఆందోళన నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు డీజిల్‌ క్యాన్లలో పోసేది లేదని నిర్వాహకులు చెప్పారని ఆరోపించారు. ఈ మేరకు పలువురు ఖాళీ క్యాన్లతో నిరసన తెలిపారు.

26న ‘కనకతార’

ఖమ్మంగాంధీచౌక్‌: తొలి తెలుగు సినిమా పాటల రచయిత చందాల కేశవదాసు 150వ జయంతి సందర్భంగా ఈ నెల 26న ‘కనకతార’నాటిక ప్రదర్శన ఉంటుందని చందాల కేశవదాసు కళా పరిషత్‌ అధ్యక్షుడు కొండపల్లి జగన్మోహన్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఖమ్మంలో వాల్‌పోస్టర్లను పలు సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement