చర్ల: పురుగులమందు సేవించిన విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని కలివేరు గ్రామానికి చెందిన యువతి భద్రాచలంలో నర్సింగ్ విద్యనభ్యసిస్తోంది. మూడు రోజుల క్రితం ఇంటి వద్దనే పురుగులముందు తాగగా కుటుంబ సభ్యులు భద్రాచలంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందింది. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి ..
పినపాక: మండలంలోని చిన్నరాజుపేట గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోలెబోయిన పొట్టయ్య (60) గేదె కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఇళ్ల వద్ద వెతుకుతూ వెళ్లాడు. ఓ ఇంటి వద్ద ఉన్న రేకుల షెడ్డు పైపునకు విద్యుత్ సరఫరా చేస్తున్న తీగ తెగి అతని తలపై పడింది. విద్యుదాఘాతానికి గురై కుప్పకూలాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
వడదెబ్బతో రైతు..
టేకులపల్లి: మండలంలోని లచ్చతండాకు చెందిన జాటోత్ భీంజీ (45) శుక్రవారం ఉదయం తన చేనులోనే వడదెబ్బకు గురై అస్వస్థతతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ యజమాని మరణంతో వారు శోకసంద్రంలో మునిగారు.


