కర్రెగుట్టల్లో ఎకో టూరిజం..
లొంగిపోయిన మావోయిస్టులు,
గిరిజనులకు టూరిస్టు గైడ్లుగా అవకాశం
భద్రాద్రి, ములుగు జిల్లాల్లో తొలి
విడతలో 20 మంది నియామకం
మాజీలకు ఉపాధి కల్పించడంతోపాటు ఎకో టూరిజంపై అవగాహన
లొంగిపోయిన మావోయిస్టులకు ఉపాధి
ఆపరేషన్ కగార్ మొదలయ్యాక 2024 జనవరి నుంచి 2026 ఏప్రిల్ 25 వరకు రికార్డు స్థాయిలో 818 మంది మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. వీరిలో జిల్లా పోలీస్ విభాగం కృషితో 330 మంది విప్లవకారులు అజ్ఞాతం వీడారు. ఇలా లొంగిపోయిన మావోయిస్టులకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రకృతి, పర్యావరణంతో పెనవేసుకున్న పర్యాటక ప్రాంతాల్లో గైడ్లుగా వారి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఆసక్తి, అవసరమైన కనీస అర్హతలు ఉన్న మాజీలు, సానుభూతిపరులను ఎంపిక చేసింది. వీరికి హైదరాబాద్‌లోనే కమ్యూనికేషన్స్ స్కిల్స్, విజిటర్ అసిస్టెన్స్, టూరిజం అవేర్‌నెస్ వంటి అంశాల్లో నెల రోజులకు పైగా శిక్షణ ఇచ్చారు. తాజాగా ఈ నెల 28న 20 మంది మాజీలకు గిరి దర్శక్‌గా నియామక ప్రతాలను అందజేశారు.
చెట్టు, పుట్ట తెలిసి ఉండటంతో..
అజ్ఞాత జీవితం గడిపే మావోయిస్టులు ఏళ్ల తరబడి అడవిలోనే జీవించడానికి అలవాటు పడ్డారు. అక్కడున్న ప్రతీ పుట్ట, చెట్టు గురించి అపారమైన జ్ఞానాన్ని వారు సొంతం చేసుకున్నారు. తక్కువ వనరులతో జీవించడం ఎలా, ఏ చెట్టు ఎందుకు ఉపయోగపడుతుంది తదిరత అంశాల్లో వారికి తిరుగు లేదు. అందువల్ల రోడ్లు, కాటేజీలు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత టూరిస్టులను ఆకట్టుకునేందుకు మాజీ మావోలు అక్కరకు వస్తారనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. దీని వల్ల మావోలకు ఉపాధి లభించడంతోపాటు అడవుల గురించి, అక్కడ అజ్ఞాత జీవితం గురించి బయటి ప్రపంచానికి చక్కగా వివరించే అవకాశం కలుగుతుంది. 40 ఏళ్ల పాటు మావోయిస్టుల అడ్డాగా కర్రెగుట్టలు ఉన్నాయి. అక్కడ ప్రమాదం ఎక్కడ పొంచి ఉంది. ఎక్కడ సురక్షిత ప్రాంతాలు ఉన్నాయనే అంశాలు పోలీసుల కంటే మాజీ మావోలకే ఎక్కువగా తెలుసు. సెక్యూరిటీ కోణంలోనూ ఆలోచించి ఈ ప్రాంతాల్లో గైడ్లుగా లొంగిపోయిన నక్సల్స్‌ను ప్రభుత్వం ఎంచుకుంది.
ముందుగా ఇక్కడే
అజ్ఞాత జీవితానికి అలవాటు పడిన నక్సల్స్‌కు గైడ్లుగా ప్రాథమిక అవగాహన కోసం ముందుగా జిల్లాలో ఉన్న పర్ణశాల, భద్రాచలం, కిన్నెరసాని అభయారణ్యం, ములుగు జిల్లాలో రామప్ప, బొగత, లక్నవరం, మేడారం వంటి ప్రాంతాల్లో గైడ్లుగా సేవలు అందించనున్నారు. ఇప్పటికే కిన్నెరసాని అభయారణ్యంలో సఫారీ సేవలు అందించేందుకు ఇటీవల మూడు వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఇతర పర్యాటక ప్రాంతాల్లోనూ త్వరలోనే సౌకర్యాలు మెరుగుపరచనున్నారు. ఓ వైపు మాజీలు గైడ్లుగా ఇక్కడ అనుభవం గడిస్తుంటే మరో వైపు కర్రెగుట్టల్లో శరవేగంగా మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ములు గు, భద్రాద్రి కొత్తగూడెం, బీజాపూర్ జిల్లాల్లో విస్తరించిన కర్రెగుట్టలు ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాలు, అబ్బురపరిచే లోయలతో ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్నాయి. ఇక్కడ జన సంచారం తక్కువగా ఉండటంతో మావోయిస్టులు వ్యూ హాత్మక అడ్డాగా మార్చుకున్నారు. ఆపరేషన్ కగార్ తుది గడువు ముగిశాక కూడా ఇక్కడ కొందరు మావోలు ఆశ్రయం తీసుకోగలిగారు. దీంతో ఈ ప్రాంతాన్ని ఎక్కువ రోజులు పోలీస్ నిఘాలో, పారా మిలిటరీ పహారాలో ఉంచడం ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతోంది. ఇక్కడున్న భౌగోళిక పరిస్థితులు, సహజ వనరులను ఆలంబనగా చేసుకుని ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటూ నిఘా వర్గాలు ప్రభుత్వానికి సూచించాయి. కర్రెగుట్టలను సరైన రీతిలో అభివృద్ధి చేస్తే మారేడుమిల్లి, అరకు తరహాలో టూరిజం డెస్టినేషన్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
లొంగిపోయిన మావోయిస్టులకు సరికొత్త ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర
ప్రభుత్వం గిరి దర్శక్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎకో టెంపుల్ టూరిజానికి రద్దీ ఎక్కువగా ఉన్న
ప్రాంతాల్లో గైడ్లుగా వినియోగించుకోనుంది. ఈ క్రమంలో పలువురిని ఎంపిక చేసి నియామక పత్రాలు కూడా అందజేసింది. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం


