నిలిచిన మెడికల్ బోర్డ్
● కార్మికులు అధికంగా ఉన్నారంటూ తగ్గింపునకు సన్నాహాలు ● ఉద్యోగం వద్దంటే రూ.30లక్షల నుంచి రూ.35 లక్షల ప్యాకేజీ ● విధివిధానాల ఖరారులో నిమగ్నమైన అధికారులు
రుద్రంపూర్: సింగరేణి వ్యాప్తంగా ఉన్న 12 ఏరియాల్లోని 18 ఓపెన్ కాస్ట్‌లు, 20 భూగర్భ గనుల్లో 40,213మంది కార్మికులు పనిచేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న గనుల్లో బొగ్గు నిక్షేపాలు తగ్గుముఖం పడుతుండటం, గనుల కోసం వేలం విధానంలో ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడలేని పరిస్థితి ఎదురవుతుండటంతో మరికొన్నేళ్లలో గనులు ఇంకా తగ్గే అవకాశముంది. ఈ నేపథ్యాన ఇప్పటికే 10వేల మంది కార్మికులు అధికంగా ఉన్నారని.. ఫలితంగా సంస్థకు సాలీన రూ.100కోట్ల భారం పడుతోందని భావిస్తున్న అధికారులు కార్మికుల సంఖ్య తగ్గింపునకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగా ‘గోల్డెన్ హ్యాండ్ షేక్’ పథకం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
సర్వీస్ ఆధారంగా చెల్లింపులు
సంస్థలో పనిచేస్తూ రెండేళ్ల సర్వీసు ఉండి అనారోగ్య కారణాలతో మెడికల్ బోర్డ్‌లో అన్‌ఫిట్ అయిన కార్మికులకు లాంగ్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద ప్రస్తుతం రూ.25 లక్షలు చెల్లిస్తున్నారు. ఇందులో జీఎస్టీ, ఆదాయ పన్ను రూ.6 లక్షలు పోగా రూ.19 లక్షలు అందిస్తున్నారు. అయితే, గోల్డెన్ హ్యాండ్ షేక్ స్కీమ్ కింద ఎలాంటి కోతలు లేకుండా సర్వీస్ ఆధారంగా రూ.30లక్షల నుంచి రూ.35 లక్షలు చెల్లించాలని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలి సింది. ఈనేపథ్యాన విధివిధానాలు రూపకల్పనలో ఆధికారులు నిమగ్నమైనట్లు సమాచారం. ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సింగరేణి డైరెక్టర్(పా) వచ్చాక మరోమారు చర్చించి యూని యన్ల అభిప్రాయం మేరకు యాజమాన్యం నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిసింది.
గతంలోనూ 8వేల మంది
సింగరేణి సంస్థలో 56 భూగర్భ గనులు ఉన్న సమయాన 1.16 లక్షల మంది కార్మికులు పనిచేసేవారు. రానురాను గనుల్లో బొగ్గు నిక్షేపాలు తగ్గుముఖం పట్టడంతో కంపెనీ డిపెండెంట్ ఉద్యోగాలు నిలిపివేయడంతో పాటు గతంలో ఓసారి గోల్డెన్ హ్యాండ్‌షేక్ స్కీమ్‌ను అమలుచేసింది. ఆ సమయాన సుమారు 8వేల మందికి బెనిఫిట్లు ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించింది.
సంస్థలో 1998లో నిలిచిపోయిన డిపెండెంట్ ఉద్యో గాల భర్తీని బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక 2018లో తిరిగి ప్రారంభించారు. తద్వారా సుమా రు 20వేల మంది మెడికల్ ఇన్‌వాలిడేషన్ ద్వారా అన్‌ఫిట్ కాగా వారిలో పలువురి వారసులు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే మెడికల్ బోర్డ్‌లో అవి నీతి, అక్రమాలు బయటపడడంతో యాజమాన్యం విచారణ బాధ్యతలు ఏసీబీకి అప్పగించింది. ఫలితంగా గత మార్చి నుంచి బోర్డు నిలిచిపోయింది. అయితే, సింగరేణిలో కార్మికుల సంఖ్య అధికంగా ఉందని.. ఉన్న వారికే పని చూపించలేని పరిస్థితి ఎదురైనందున బోర్డును నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదేసమయాన మెడికల్ బోర్డ్‌లో అన్‌ఫిట్ అయిన కార్మికుల పిల్లలు 400మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించినా ఉత్తర్వులు జారీ చేయలేదు. దీనికి కూడా కార్మికులు అధికంగా ఉండడమేనని చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే యాజమాన్యం తిరిగి గోల్డెన్ హ్యాండ్‌షేక్ స్కీమ్ అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.


