చుంచుపల్లి/చండ్రుగొండ: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాల భరోసా కార్యక్రమం చిన్నారుల భవిష్యత్‌కు వరమని కలెక్టర్ అంకిత్ అన్నారు. జిల్లా కేంద్రం రామవరంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రలో శుక్రవారం జిల్లా స్థాయి బాల భరోస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం బాల భరోసా కార్యక్రమం చేపట్టిందన్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు, శారీరక ఎదుగుదల లోపాలు, మానసిక వికాసంలో ఆలస్యం వంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, మెరుగైన చికిత్స అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఎంసీహెచ్‌లో చిన్నారులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జిల్లా సంక్షేమ అధికారిణి జె.స్వర్ణలత లెనినా, వైద్యాధికారులు ప్రతాప్, వినోద్, నాగభూషణం, పి. సంపత్, సీడీపీఓలు లక్ష్మీప్రసన్న, వెంకటరమణ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లులో ప్రమాణాలు పాటించాలి
ధాన్యం కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ అంకిత్ అధికారులకు ఆదేశించారు. మండలంలోని దామరచర్లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించి పరిశీలించారు. కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించా రు. రైతులు లాభపడే విధంగా అధికారుల పని తీరు ఉండాలని అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. తహసీల్దార్ జగదీశ్వర్‌ప్రసాద్, ఎంపీఓ ఖాన్, ఏఓ వినయ్ పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


