ఎవరు రాశారీ మరణశాసనం? | - | Sakshi
Sakshi News home page

ఎవరు రాశారీ మరణశాసనం?

May 2 2026 7:38 AM | Updated on May 2 2026 7:38 AM

● కుటుంబంలో మిగిలిన చిన్నారి కూడా మృతి ● నలుగురి మృతితో మిస్టరీగానే ఘటన ● తల్లీబిడ్డ మూడు రోజులు ఆకలితో అలమటించారా?

● కుటుంబంలో మిగిలిన చిన్నారి కూడా మృతి ● నలుగురి మృతితో మిస్టరీగానే ఘటన ● తల్లీబిడ్డ మూడు రోజులు ఆకలితో అలమటించారా?
మూడు రోజులు తిండి లేకుండా..

ఖమ్మంక్రైం: కుటుంబ కలహాలు పచ్చని సంసారంలో నిప్పులు పోశాయని కొందరు.. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో గొడవలు జరిగాయని మరికొందరు.. కట్నం బాకీ ఉండడమే ఘర్షణలకు కారణమని ఇంకొందరు చెబుతున్నా ఆ కుటుంబంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందడం విషాదాన్ని నింపింది. అసలు కారణాలపై స్పష్టత రాకున్నా పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఖమ్మంలో నివాసముంటున్న నేలకొండపల్లి మండలానికి చెందిన కణతాల రాము (30) కుటుంబంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆయన చిన్నకుమార్తె కూడా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. దీంతో అసలు నిజమేమిటో మిస్టరీగానే మిగిలిపోనుంది.

తొలుత ఇద్దరు..

ఖమ్మం బుర్హాన్‌పురంలో కణతాల రాము(30) తన భార్య రమ్య(28), కుమార్తెలు దివ్యశ్రీ (5), రితిక(3)తో నివాసముండేవాడు. గతనెల 26న ఆయన ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడం, ఆయన భార్య రమ్య ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పరిశీలించారు. అప్పటికే రాము, దివ్య చనిపోయి మూడు రోజులు కావడంతో మృతదేహాలు కుళ్లిపోయినట్లు గుర్తించారు. అదే సమయాన రమ్య, రితిక కూడా అపస్మారక స్థితిలో ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమ్య 30వ తేదీన, హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించిన రితిక గురువారం రాత్రి మృతి చెందారు.

అన్నీ అనుమానాలే..

పోలీసులు పరిశీలించిన రోజు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాము, దివ్యశ్రీ మృతదేహాలు బయటపడ్డాయి. రమ్య పురుగులమందు తాగి ఉండడం, రితిక తలపై గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. భర్త, పెద్ద కుమార్తెను రమ్యే హత్య చేసి ఆ తర్వాత చిన్నకుమార్తె హత్యకు సైతం యత్నించిందని.. చివరగా తాను సైతం పురుగులమందు తాగినట్లు భావించారు. ఆమెను ఆస్పత్రికి తరలించి కాస్త కోలుకోగానే ఆరా తీయగా కొన్ని వివరాలు చెప్పినట్లు తెలిసింది.

23వ తేదీన రాము, 24న దివ్యశ్రీ

రాము, దివ్యశ్రీ మృతదేహాలను గతనెల 26న(ఆదివారం) గుర్తించినా.. అంతకు మూడు రోజుల ముందే(గురువారం) రాము మృతి చెందాడని సమాచారం. మూడు రోజులుగా భార్యతో గొడవపడుతున్న రాము బయటకు వెళ్లి విషం తాగొచ్చి మృతి చెందగా, ఆయన మృతికి తానే కారణం అనుకుంటారని రమ్య భావించి పిల్లలను బయటకు పంపలేదని సమాచారం. దివ్యశ్రీ ఇంటి పక్కనే వారితో చనువుగా ఉండటం.. ఆమె బయటకు వెళ్తే రాము మృతి విషయం బయటపడుతుందనే భావనతో 24వ తేదీన నిద్రలోనే తల్లి హత్య చేసి ఉంటుందనే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇక 25వ తేదీన ఇంట్లోనే మృతదేహాలతో ఉండగా.. 26వ తేదీన ఉదయం చిన్నకుమార్తెను మృతదేహాల వద్దే ఉంచి స్థానికంగా కిరాణం షాపునకు వెళ్లి ఎలుకల మందు తీసుకొచ్చి, ఓఆర్‌ఎస్‌లో కలిపి తాను తాగడమే కాక చిన్న కుమార్తె రితికకు కూడా తాగించానని చెప్పినట్లు సమాచారం. అయినా కుమార్తె మృతి చెందకపోవడంతో బలమైన వస్తువుతో ఆమె నెత్తి మీద కొట్టిందని తెలిసింది.

మొదటి నుంచి కలహాలే

నేలకొండపల్లి అనంతనగర్‌కు చెందిన రాముకు, నడిగూడెం మండలం వాయిలసింగారానికి చెందిన రమ్యతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. తొలుత నేలకొండపల్లిలో ఉన్నా ఆపై ఖమ్మంకు మకాం మార్చారు. ఆది నుంచి వీరి మధ్య ఉన్న కలహాలు రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టాక పెరిగాయని తెలిసింది. కొడుకు పుడితే పుట్టువెంట్రుకల కార్యక్రమం స్వగ్రామంలో ఘనంగా నిర్వహించాలని రాము భావించగా.. బిడ్డే పుట్టడంతో ఆమెకు మూడేళ్లు నిండాక కుటుంబం మధ్యే మొక్కు తీర్చుకున్నాడు. రమ్య కుటుంబీకులను పిలవకపోవడంతో ఆమె తరచూ గొడవ పడేదని సమాచారం. అలాగే, పెళ్లి సందర్భంగా ఇస్తామన్న నగదులో రూ.లక్ష, కోదాడలో వంద గజాల స్థలం రమ్య కుటుంబీకులు ఇవ్వకపోవడం కూడా గొడవలకు కారణమని సమాచారం.

పోలీసుల విచారణలో భాగంగా గత నెల 23న రాత్రి వంట చేసిన రమ్య.. ఆ తర్వాత మళ్లీ పొయ్యి వెలిగించలేదని బూజు పట్టి ఉన్న అన్నాన్ని చూసి పోలీసులు ఈ భావనకు వచ్చారు. అంటే గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ అన్నం లేదని సమాచారం. చివరకు ఇంటి సమీపంలోని వృద్ధురాలు 26వ తేదీన ఉదయం ఇడ్లీలు తీసుకొస్తే తాను తినకపోగా.. చిన్నకూతురుకూ తినిపించలేదని తెలిసింది. ఆమెకు ఎలుకల మందు తాగించినందున ఇడ్లీ తినిపిస్తే మందు విరిగిపోతుందనే భావనకు వచ్చి నట్లు తెలుస్తోంది. అయితే, కుటుంబ కలహాలే తప్ప మరెవరికీ ఘటనలో సంబంధం లేదని పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చినా.. నలుగురి మృతితో అసలు కారణాలు మాత్రం వారితోనే సమాధి అయినట్లయింది. కాగా, రాము, ఆయన పెద్దకుమార్తె మృతదేహాలకు స్వగ్రామమైన అనంతనగర్‌లో అంత్యక్రియలు నిర్వహించగా.. రమ్య మృతదేహాన్ని తీసుకురావడానికి ఆయన కుటుంబీకులు అంగీకరించలేదని సమాచారం. దీంతో మార్గమధ్యలోనే వాహనాన్ని వెనక్కి తిప్పి ఖమ్మం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. గురువారం హైదరాబాద్‌లో మృతి చెందిన రితిక మృతదేహాన్ని అనంతనగర్‌కే తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement