కళ తగ్గుతోంది
● నాడు కార్మికులకు చిరునామాగా జిల్లా ● పరిశ్రమల మూతతో తగ్గిపోతున్న కార్మికుల సంఖ్య ● కొత్త పరిశ్రమల ఏర్పాటులో అంతులేని జాప్యం
నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
ప్రపంచ వ్యాప్తంగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు. స్వాతంత్రానికి పూర్వమే బ్రిటీష్ జమానాలో ప్రిన్సిలీ స్టేట్‌గా ఉన్న నిజాం రాజ్యంలో రైల్వే యూనియన్ (హైదరాబాద్), అజాంజాహి మిల్లు వర్కర్స్ (వరంగల్) యూనియన్ల తర్వాత మూడో యూనియన్ కొత్తగూడెంలో ఏర్పాటైంది. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ పేరిట రహస్యంగా 1938లో ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించారు. ఆ తర్వాత కొత్తగూడెం శివారులో ఉన్న హేమచంద్రాపురం అడవులు వేదికగా 1942లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ పేరు వెలుగులోకి వచ్చింది. అనంతరం 1944లో కార్మిక సంఘంగా రిజిస్టరైంది. ఆ తర్వాత అనేక కార్మిక సంఘాలు ఆవిర్భవించాయి. ప్రస్తుతం సింగరేణిలో పద్నాలుగు సంఘాలు రిజిస్ట్రర్డ్ కార్మిక సంఘాలుగా ఉన్నాయి. ఒకప్పుడు లక్షా ఇరవై వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించిన సింగరేణిలో ఇప్పుడు కార్మికుల సంఖ్య 39 వేలకు పడిపోయింది. మరోవైపు ఇల్లెందులో జేకే, మణుగూరులో కొండాపూర్ గనుల విస్తరణ ఆశించి వేగంతో సాగడం లేదు. ఫలితంగా క్రమంగా సింగరేణి ప్రభావం కూడా తగ్గుతూ వస్తోంది.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ఏడు దశాబ్దాల క్రితమే అధిక సంఖ్యలో కార్మికులు ఉన్నారు. కానీ ఇప్పుడా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. పాత పరిశ్రమలు మూతపడుతుంటే కొత్త పరిశ్రమలు రావడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. ఫలితంగా జిల్లా క్రమంగా కార్మిక కళను కోల్పోతోంది.
కేటీపీఎస్ విస్తరణ జరిగేనా..?
కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ తొలి దశలో 60 మెగావాట్ల సామర్థ్యంలో నాలుగు యూనిట్లు 2023 వరకు సేవలు అందించాయి. ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ (ఓ అండ్ ఎం) పేరుతో ఈ యూనిట్లు కొనసాగినన్ని రోజులు పాల్వంచ ప్రాంతం కార్మికులతో కళకళాడింది. కాలపరిమితి ముగిసిపోవడంతో వీటిని మూసివేశారు. ఇదే స్థలంలో కొత్తగా 800 మెగావాట్ల కొత్త యూనిట్ కోసం రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల నిపుణుల కమిటీ కొత్త ప్లాంట్ల స్థాపన సాధ్యాసాధ్యాలు, లాభనష్టాలపై బేరీజు వేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదికపై కొత్త విద్యుత్ కేంద్రం భవితవ్యం ఆధారపడి ఉంది.
కొత్త పరిశ్రమల జాడేది?
ఇల్లెందులో 100 మెగావాట్ల సామర్థ్యంలో పంప్డ్ స్టోరేజీ హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం టాటా కన్సల్టెన్సీతో సర్వే చేయించారు. ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే పరిస్థితి నెలకొంది. ప్రైవేటు రంగంలో సారపాకలోని స్పెషల్ పేపర్ బోర్డ్ విస్తరణను రూ. 2 వేల కోట్లతో చేపట్టేందుకు ఐటీసీ సంస్థ ముందుకు వచ్చింది. 2023 జూలైలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగింది. ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు. అశ్వారావుపేటలో పామాయిల్ పరిశ్రమ విస్తరణ ప్రతిపాదనలకే పరిమితమైంది. బూర్గంపాడు మండలంలో చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం కరువైంది.
ప్రకృతి సంపదకు, ఖనిజాలకు నిలయమైన జిల్లాలో సింగరేణి మొదలుకుని భద్రాద్రి థర్మల్ వపర్ ప్లాంట్ వరకు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో అనేక పరిశ్రమలు నెలకొల్పారు. ఫలితంగా అప్పటి జిల్లా కేంద్రమైన ఖమ్మంను కాదని కొత్తగూడెంలో ఎంప్లాయిమెంట్ ఆఫీస్, కాలుష్య నియంత్రణ మండలి, ఈఎస్‌ఐ ఆస్పత్రి (సారపాక) వంటివి ఇక్కడకు వచ్చాయి. ఓ ఆర్థిక సంస్కరణ ప్రభావం మరో వైపు బలమైన రాజకీయ నాయకత్వం కరువైపోవడం వల్ల గడిచిన దశాబ్దకాలంగా జిల్లాలో కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. దీనికి తోడు కాలానుగుణంగా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోలేని పరిశ్రమలు కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రభుత్వ రంగంలో పాల్వంచలో ఏపీ స్టీల్స్, స్పాంజ్ ఐరన్ , ప్రైవేటు రంగంలో కొత్తగూడెంలో కిన్నెర స్టీల్స్, బేరియం ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఫలితంగా వీటి ఆధారంగా వెలిసిన కార్మిక వాడలు నామరూపాల్లేకుండా పోతున్నాయి.


