ఉపాధ్యాయుల కృషి.. విద్యార్థుల పట్టుదల | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల కృషి.. విద్యార్థుల పట్టుదల

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

● నూరుశాతం ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు ● పదో తరగతికి జూన్‌ నుంచే ప్రత్యేక తరగతులు ● టీం వర్క్‌, పిల్లల శ్రద్ధతోనే సాధ్యమైందంటున్న టీచర్లు ఐక్యంగా పనిచేశాం.. జూన్‌ నుంచే ప్రత్యేక తరగతులు

మరికొన్ని పాఠశాలల్లో..

● నూరుశాతం ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు ● పదో తరగతికి జూన్‌ నుంచే ప్రత్యేక తరగతులు ● టీం వర్క్‌, పిల్లల శ్రద్ధతోనే సాధ్యమైందంటున్న టీచర్లు

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలో పదో తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోయినా కొన్ని పాఠశాలలు మాత్రం నూరుశాతం ఫలితాలు సాధించాయి. 68 పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించగా, వాటిలో 42 ప్రభుత్వ పాఠశాలలు, 26 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయులు టీం వర్క్‌ చేసిన పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌లోని రామవరంలో ఉన్న నేతాజీ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది 8 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 8 మంది కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ సౌకర్యాలు లేకపోయినా ఉపాధ్యాయుల ప్రోత్సాహం, విద్యార్థుల పట్టుదలతో మెరుగైన ఫలితాలు సాధించగలిగారు. నేతాజీ పాఠశాల వరుసగా మూడేళ్ల నుంచి నూరుశాతం ఫలితాలు సాధిస్తోంది.

ఉపాధ్యాయుల ప్రత్యేక దృష్టి

వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. విద్యాసంవత్సరానికి నెల ముందు నుంచే బోధన ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా, ఇక్కడ మాత్రం అంతకంటే ముందు నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. రామవరంలోని నేతాజీ పాఠశాలలో జూన్‌ నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించారు. పండుగ రోజుల్లో తప్పా మిగతా అన్ని రోజుల్లో బోధన చేపట్టారు. ఉపాధ్యాయులు వెంటపడి చదివించారు. ఉపాధ్యాయులు చందాలు వేసుకుని విద్యార్థులకు స్నాక్స్‌ కొనుగోలు చేసి ప్రత్యేక తరగతుల్లో ప్రోత్సహిస్తున్నారు. అన్ని సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయులు అంకితభావంతో పాఠాలు బోధించగా, విద్యార్థులు సులభంగా ఉత్తీర్ణత సాధించారు.

మూడేళ్లుగా రామవరంలోని నేతాజీ పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాఽధిస్తోంది. పదో తరగతిలో అన్నీ సబ్జెక్టుల ఉపాధ్యాయులు టీం వర్క్‌తో పని చేయడంతో మెరుగైన ఫలితాలు రాబట్టగలిగాం. భవిష్యత్‌లో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతాం.

–ఎం.ద్రౌపది, నేతాజీ పాఠశాల హెచ్‌ఎం

విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పాఠశాలలో ఉపాధ్యాయులు మాకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. దీనివల్ల సబ్జెక్ట్‌ల రివైజ్‌ ఎప్పటికప్పుడు జరిగేది. ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై శ్రద్ధ పెట్టడంతో అందరం పాస్‌ అయ్యాం.

–వి.అర్చన, నేతాజీ పాఠశాల, రామవరం

నేతాజీ పాఠశాలలో వి.అర్చన 451 మార్కులు, జి.శ్రీవల్లి 448, బి.రిషికేష్‌ 434 మార్కులు సాధించారు. పాల్వంచ మండలంలోని పునుకుల జెడ్పీ పాఠశాల లో 12 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, అందరూ ఉత్తీర్ణత సాధించారు. అశ్వారావుపేట బాలుర బీసీ వెల్ఫేర్‌ విద్యార్థులు 54 మందికి 54 మంది, పినపాకలోని బాలికల బీసీ వెల్ఫేర్‌లో 60 మందికి 60 మంది, దమ్మపేటలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌లో 59 మందికి 59 మంది, అశ్వారావుపేటలోని టీఎంఆర్‌లో 33 మందికి 33 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి వందశాతం ఫలితాలు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement