నృసింహాలయంలో ఎదుర్కోలు ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

నృసింహాలయంలో ఎదుర్కోలు ఉత్సవం

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

నేడు తిరుకల్యాణమహోత్సవం

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీనరసింహాస్వామి ఉపాలయంలో వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం నరసింహాస్వామి జయంతి సందర్భంగా పంచామృతాలతో అభిషేకం జరిపారు. తిరుకల్యాణ మహోత్సవ పూజలలో భాగంగా అగ్నిప్రతిష్ట, ధ్వజారోహ ణం నిర్వహించారు. సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం ఆటపాటలతో జరిపారు. ఆ తర్వాత గరుడ వాహన సేవ గావించారు. శనివారం స్వామివారికి అభిషేకం, హవనం, తిరుకల్యాణ మహోత్సవం జరిపేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్‌రావు, ప్రధాన అర్చకులు విజయరాఘవన్‌, కోటి రామస్వరూప్‌, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

కనుల పండువగా నిత్యకల్యాణం

దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం గురువారం కమనీయంగా జరిగింది. తొలుత తెల ్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

పెద్దమ్మతల్లికి

సువర్ణ పుష్పార్చన

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు.

నేడు చండీహోమం

పెద్దమ్మతల్లి ఆలయంలో శుక్రవారం చండీహోమం పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ రజనీకుమారి తెలిపారు. పూజలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్రనామాలను నమోదు చేసుకోవాలని కోరారు.

మెరుగైన వైద్యం

అందించాలి

ఐటీడీఏ పీఓ రాహుల్‌

దుమ్ముగూడెం : గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని, గర్భిణుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌ అన్నారు. గురువారం ఆయన ములకపాడు పీహెచ్‌సీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు వివరించాలని, ఆస్పత్రిలో ఓఆర్‌ఎస్‌ పాకెట్లు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. సూపర్‌వైజర్ల మానిటరింగ్‌ సక్రమంగా ఉండాలన్నారు. అనంతరం రూ.2.23 కోట్లతో నిర్మించిన ఇండోర్‌ స్టేడియం, రూ.200 కోట్లతో చేపట్టిన యంగ్‌ ఇండియా పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు సైదులు, విజయలక్ష్మి, అశోక్‌ కుమార్‌, వివేక్‌ రామ్‌, హరీష్‌, నితిన్‌, నవీన్‌ కుమార్‌, పాయం శ్రీనివాస్‌ రావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement