మణుగూరు రూరల్/అశ్వాపురం/దుమ్ముగూడెం: జిల్లాలోని మణుగూరు, దుమ్ముగూడెం తదితర మండలాల్లో గురువారం ఒక్కసారిగా వాతావరణం చల్ల బడింది. పలు చోట్ల వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. మణుగూరు ఏరియాలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ ప్రాంతంలో వడగళ్లు పడటంతో కార్మికులు ఇబ్బంది పడ్డారు. వర్షంతో బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీతకు కొంత ఆటంకం ఏర్పడింది. యాసంగి పంటలు కోత దశలో ఉండటంతో అకాల వర్షానికి రైతులు భయాందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. కాగా మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్ కల్లాల వద్ద, ఆరుబయట ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు అప్రమత్తంగా ఉండి పంట తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీటీ రామారావు, ఆర్‌ఐ గోపి పాల్గొన్నారు.
రహదారిపై కూలిన చెట్టు
అశ్వాపురం మండలంలో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గోపాలపురం వద్ద మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై చెట్టు నేలకూలింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
పలుచోట్ల వడగళ్ల వాన


