దమ్మపేట: మండల పరిధిలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ఉన్న వేబ్రిడ్జి కాంటా 100 కేజీల బరువును తక్కువగా చూపిస్తోందంటూ ఆయిల్‌పామ్ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. దమ్మపేట, మందలపల్లిలోని ప్రైవేటు వేబ్రిడ్జిల వద్ద పెట్టిన గెలల ట్రాక్టర్ కాంటాకు, ఫ్యాక్టరీలో పెట్టిన కాంటాకు 100 కేజీల వ్యత్యాసం ఎందుకు వస్తుందని ఫ్యాక్టరీ మేనేజర్ నాగబాబును నిలదీశారు. ఫ్యాక్టరీ గేటు మూసేసి ఆందోళన చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి మరోసారి ఫ్యాక్టరీ, ప్రైవేట్ కాంటాలను సరిచూడాలని చెప్పారు. కాంటాలను పరిశీలించిన అనంతరం ప్రైవేట్ కాంటాలోనే తేడా ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది.


