మణుగూరు రూరల్: మణుగూరు ప్రాంతానికి చెందిన జంజర్ల శిరీష ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఇంపాక్ట్ ఆఫ్ ఔట్ సోర్సింగ్ హెచ్‌ఆర్ ప్రాక్టీసెస్ ఆన్ ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్ ఆన్ ఎంఎన్‌సీస్ అనే అంశంపై ఆమె పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. డాక్టర్ వి.సమున్నత పర్యవేక్షణలో ఆమె పరిశోధన పూర్తి చేశారు. దీంతో వర్సిటీ గత నెల 25న పీహెచ్‌డీ పట్టా ప్రదానం చేసింది. ఈ సందర్భంగా శిరీషను పలువురు అభినందించారు.
ధాన్యం కొనుగోలు
కేంద్రాల సందర్శన
సుజాతనగర్: సుజాతనగర్‌లోని ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయాధికారి వి.బాబూరావు గురువారం సందర్శించారు. తూర్పారబట్టే విషయంలో రైతులకు పలు సూచనలు చేశారు. మొక్కజొన్న రైతులు తమ పంటను ఇంటి వద్దనే ఆరబెట్టుకుని కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ నర్మద పాల్గొన్నారు.
నేటి నుంచి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో శుక్రవారం నుంచి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నారు. ఈ మేరకు గురువారం సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జిల్లా ఉపాధి, కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులను సభ్యత్వ నమోదు డ్రైవ్‌కు నోడల్ అధికారులుగా నియమించారు. ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కలెక్టరేట్‌లో నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సభ్యత్వ నమోదు మే1 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో నిర్వహించనున్నారు. జిల్లా ప్రజలు, యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. సలహాల కోసం 93929 19706 నంబరులో సంప్రదించాలని సూచించారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
చింతకాని: మండలంలోని నాగులవంచ రైల్వేకాలనీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కాంపెల్లి శేషగిరిరావు(38) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన భార్య వసంత, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... శేషగిరిరావు కుటుంబానికి అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబంతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఇరు కుటుంబాలపై బుధవారం కేసులు నమోదయ్యాయి. ఈక్రమాన గ్రామంలో నిరుపయోగంగా ఉంటున్న ఇంట్లో రేకుల షెడ్డు కడ్డీకి విద్యుత్ వైర్‌తో శేషగిరిరావు ఉరి వేసుకున్నాడని గురువారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పరిశీలించగా రేకుల షెడ్డు ఆరు అడుగుల ఎత్తే ఉండడం, వైర్లు పూర్తిగా బిగుసుకుపోకపోవడం, మృతదేహం సగం నేలను తాకి ఉండడంతో కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ కుటుంబంతో గొడవ ఉన్న వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని శేషగిరిరావు భార్య వసంత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్సై వీరేందర్ ఆధ్వర్యాన దర్యాప్తు చేపట్టారు. ఆయన మృతదేహం వద్ద మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు తదితరులు నివాళులర్పించారు.
పోలీస్ సిబ్బందిని
దుర్భాషలాడిన వ్యక్తులపై కేసు
పాల్వంచ: మద్యం మత్తులో పోలీస్ సిబ్బందిని దుర్భాషలాడిన ముగ్గురిపై గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... గత నెల 29న నటరాజ్ సెంటర్ వద్ద అనుమానాదాస్పదంగా నంబర్‌లేని ద్విచక్రవాహనం కనిపించడంతో బ్లూకోల్ట్స్ సిబ్బంది వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వెంగళరావు కాలనీకి చెందిన బాదావత్ అనిల్‌కుమార్, వెంకటేశ్వర హిల్స్ కాలనీకి చెందిన వాంకుడోతు ప్రభు, అల్లూరి సెంటర్‌కు చెందిన వాంకుడోత్ యేసు మద్యం మత్తులో పోలీస్ స్టేషన్‌కు వచ్చి సిబ్బందిని దుర్భాషలాడి దౌర్జన్యానికి దిగారు. పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని బెదిరింపులకు దిగి విధులకు ఆటంకం కలిగించారు. హెడ్‌కానిస్టేబుల్ ఎం.రామకృష్ణ ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని న్యాయం స్థానం ఎదుట హాజరుపర్చినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.


