పూర్తికాని టెండర్లు | - | Sakshi
Sakshi News home page

పూర్తికాని టెండర్లు

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

● మట్టి నమూనాలు సేకరించిన అధికారులు ● నివేదిక వచ్చాకే టెండర్లు ఖరారయ్యే అవకాశం ● రామాలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కోరుతున్న భక్తులు

● మట్టి నమూనాలు సేకరించిన అధికారులు ● నివేదిక వచ్చాకే టెండర్లు ఖరారయ్యే అవకాశం ● రామాలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కోరుతున్న భక్తులు

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనుల హడావిడి నెలకొంది. ఉపాలయాల్లోని మూలమూర్తులను, ఆళ్వార్ల మూర్తులను తరలించేందుకు కళావాహన, జీర్ణోద్ధారణ ప్రక్రియ పూర్తి చేశారు. పంచలోహ విగ్రహాలను ప్రధానాలయంలో ఉంచి ఇతర మూర్తులను బాలాలయానికి తరలించారు. చిత్రకూట మండపంలో ఉంచిన స్వర్ణ పూత వాహనాలను సైతం ధ్యానమందిరంలో భద్రపరిచారు. దీంతో ఆలయంలో ఆర్జిత సేవలు దాదాపుగా ఆగిపోయే పరిస్థితి నెలకొంది. వెండి వాకిలి వద్దనే భక్తులకు అర్చనలు జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు ఏప్రిల్‌ నెలాఖరులోగా ప్రారంభించాలని అధికారులు భావించినా ఇప్పటివరకు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయకపోవడం గమనార్హం.

మట్టి నమూనాల ఫలితాలు వస్తేనే..

కొద్ది రోజుల క్రితం నాలుగు దిక్కులా ఆర్కిటెక్ట్‌ల బృందం, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు రెండు ప్రాకారాలకు మార్కింగ్‌ చేశారు. ప్రస్తుతం మట్టి శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపి, అక్కడి నుంచి నివేదికలు వచ్చాక పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పనులు పర్యవేక్షిస్తున్న ఆర్‌అండ్‌బీ శాఖ ఇప్పటికే అంచనాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల పరిశీలనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏప్రిల్‌ నెలాఖరులోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ నెల గడిచినా టెండర్‌ ప్రక్రియ పూర్తికాలేదు. మట్టి శాంపిల్స్‌ నివేదిక వచ్చాకే టెండర్‌ ప్రక్రియ పూర్తవుతుందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు.

యుద్ధ ప్రతిపాదికన పనులు జరగకపోతే..!

ప్రభుత్వం పనుల పూర్తికి మార్చి 31వ తేదీ వరకు గడువు విధించింది. దాదాపు ఏడాది మాత్రం సమయం ఉంది. ఈలోగా రెండు ప్రాకారాలు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇక వర్షాకాలంలో గోదావరి వరదలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలు ఉన్నాయి. వీటిన్నింటిని ఎదుర్కొంటూనే పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే చిత్రకూట మండపం, ఆలయంలో ఉపాలయాల తొలగింపు ప్రక్రియ ఈ లోపు పూర్తి చేస్తే పనులకు మార్గం సుగమం అయ్యేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రత్యేకంగా టెండర్‌ పిలిస్తే పనులు పుంజుకునేవి. ఆలయ అభివృద్ధి పనులతోపాటే టెండర్‌ నిర్వహించాలని అధికారులు భావించటంతో సివిల్‌ పనులు ఇంతవరకు ప్రారంభమే కాలేదు. టెండర్‌ ప్రక్రియతో సంబంధం లేకుండా నిర్మాణాల తొలగింపును పూర్తి చేస్తే పనులు నిరంతరాయంగా జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement