కారు ఢీకొని సింగరేణి ఉద్యోగి మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని సింగరేణి ఉద్యోగి మృతి

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/రుద్రంపూర్‌: రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మృతిచెందిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. టూ టౌన్‌ పోలీసుల కథనం ప్రకారం... కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్‌లో నివాసముంటున్న రూపేష్‌ పాసీ (36) సత్తుపల్లిలోని కిష్టారం ఓసీలో జనరల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి రుద్రంపూర్‌ నుంచి కొత్తగూడెం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ సమీపంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

వ్యక్తి అద్యశ్యం

దమ్మపేట: వ్యక్తి అదృశ్యంపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని నాచారం గ్రామానికి చెందిన డేరంగుల నాగరాజు(35) గత నెల 24న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. అదృశ్యమైన వ్యక్తి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సాయికిషోర్‌ రెడ్డి తెలిపారు.

బైక్‌ దొంగ అరెస్ట్‌

అశ్వారావుపేటరూరల్‌: బైక్‌ చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పట్టణంలోని భద్రాచలం రోడ్‌లో మడుపు బ్రహ్మశాస్త్రి అనే వ్యక్తి గత నెల 19న ద్విచక్రవాహనాన్ని పార్కింగ్‌ చేయగా, గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం బీసీఎం రోడ్‌లో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో ఏపీలోని అమలాపురం ప్రాంతానికి చెందిన తవీటికి శ్రీను అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో విచారణ చేపట్టారు. దీంతో బైక్‌ చోరీ చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్‌ చేసి దమ్మపేట కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్‌ఐ యయాతి రాజు తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

మధిర: మండలంలోని మహాదేవపురానికి చెందిన పాణిది మురళి(22) బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన తండ్రి మూడేళ్ల క్రితం మృతి చెందగా, తల్లి కూళీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈనేపథ్యాన మనస్థాపానికి గురైన మురళి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై ఆయన తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

భార్యపై భర్త హత్యాయత్నం

దుమ్ముగూడెం: హత్యాయత్నం ఘటనలో పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని కె.దుమ్ముగూడెం గ్రామానికి చెందిన కనుకు నందినిపై ఆమె భర్త సంతోష్‌ బుధవారం రాత్రి కత్తితో హత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలుకాగా చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్‌ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement