గుండాల: పోడు భూమి విషయంలో రైతు నుంచి రూ.10వేల లంచం తీసుకుంటూ ఫారెస్టు బీట్ ఆఫీసర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గుండాల మండలం నడిమిగూడెం బీట్ ఆఫీసర్ బానోత్ నరేష్ సాయనపల్లి బీట్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సాయనపల్లికి చెందిన ఓ రైతు ఆరు ఎకరాల్లో పోడు వ్యవసాయం సాగు చేస్తున్నాడు. అందులో మూడెకరాలకు పట్టా లేకపోవడంతో ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా మూడెకరాల పట్టా కూడా రద్దు చేస్తామని బెదిరించిన నరేష్.. ఎలాంటి ఇబ్బంది రావొద్దంటే తనకు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈమేరకు పూర్తి ఆధారాలు సేకరించిన అధికారులు గురువారం అటవీ కార్యాలయంలో రైతు నుంచి బీట్ ఆఫీసర్ రూ.10వేలు లంచం తీసుకుంటున్న క్రమాన రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ మాట్లాడుతూ రైతు నుంచి ఫిర్యాదు అందిన రెండు రోజుల్లోనే సరైన సాక్ష్యాలతో బీట్ ఆఫీసర్‌ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. బీట్ ఆఫీసర్ నరేష్‌పై కేసు నమోదు చేయగా, వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులెవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ప్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పోడు రైతు నుంచి రూ.10వేల
లంచం డిమాండ్


