ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో 20శాతం వెనుకంజ
సింగరేణిలో రోజువారీ బొగ్గు ఉత్పత్తి 77శాతమే..
వంద శాతం దాటిన మణుగూరు ఏరియా
మూడు ఏరియాల్లోనే...
రుద్రంపూర్: సింగరేణి సంస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ ఆర్థిక సంవత్సరం మొదటి నెల(ఏప్రిల్)లో సింగరేణి వ్యాప్తంగా 18 ఓపెన్‌కాస్ట్‌లు, 20 భూగర్భగనుల్లో నెల వారీ లక్ష్యాన్ని చేరలేదు. ఈనెలలో 46,68,908 టన్నుల లక్ష్యానికి 37,19,595 టన్నుల(80శాతం) ఉత్పత్తి మాత్రమే నమోదు కావడంతో 20 శాతం వెనుకంజలో ఉంది.
ఫలించని సమీక్షలు
సింగరేణి సీఎండీగా ఫిబ్రవరి 12న డాక్టర్ జ్యోతి బుద్దప్రకాశ్ బాధ్యతలు స్వీకరించినా ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం సమీపించడంతో క్షేత్రస్థాయిలో పరిశీలన సాధ్యం కాలేదు. ఈమేరకు 2025–26లో పలుదఫాలుగా సవరించిన అనంతరం 60 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని కూడా చేరలేక 58 మిలియన్ టన్నుల వద్ద ఆగిపోయింది. ఈక్రమాన నూతన ఆర్థిక సంవత్సరంలో పలుమార్లు సమీక్షలు నిర్వహించినా 12 ఏరియాలకు గాను మూడు చోట్ల వంద శాతం ఉత్పత్తి నమోదుకాగా, మిగిలినవి వెనుకంజలోనే ఉండడం గమనార్హం. ఇక రోజువారీ 2,02,996 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను గాను 1,56,018 టన్నులు(77 శాతం)గా నమోదవుతోంది. ఇదిలాగే కొనసాగితే వర్షాకాలంలో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడనున్నందున మే నెలలోనైనా ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలనే సూచనలు వస్తున్నాయి.
ఏప్రిల్‌లో లక్ష్యం మేర ఉత్పత్తి నమోదు కాకపోవడంతో అధికారులతో సమీక్షిస్తాం. మే నెలలో లక్ష్యాన్ని చేరడమే కాక ఏప్రిల్‌లో తగ్గిన ఉత్పత్తి రాబట్టేలా చర్యలు తీసుకుంటాం. కొత్తగూడెం ఏరియాలో ఉత్పత్తి ప్రారంభమైతే ఏటా కనీసం 8లక్షల టన్నుల నుంచి 10లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నమోదవుతుంది.
– కొప్పుల వెంకటేశ్వర్లు,
డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్)
సింగరేణిలోని12 ఏరియాలకు యాజమాన్యం రోజువారీ, నెలవారీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించగా.. డైరెక్టర్లు తరచుగా సమీక్షిస్తున్నారు. అయినప్పటికీ ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో బెల్లంపల్లి ఏరియాలో 105శాతం, మణుగూరులో 104శాతం, అడ్రియాలలో 100శాతం నమోదైంది. మిగతా తొమ్మిది ఏరియాలు లక్ష్యసాధనకు దూరంగా ఉండడం గమనార్హం. ఈమేరకు మందమర్రి ఏరియాలో 98శాతం ఉత్పత్తి నమోదు కాగా, కొత్తగూడెంలో 95శాతం, సత్తుపల్లిలో 94, ఇల్లెందులో 78, ఆర్జీ–2 ఏరియాలో 64, శ్రీరాంపూర్‌లో 58, ఆర్జీ–1, 3 ఏరియాల్లో 51, భూపాలపల్లి ఏరియాలో 20శాతం వద్దే ఉత్పత్తి ఆగిపోయింది. కాగా, టన్నుల వారీగా పరిశీలిస్తే... సత్తుపల్లి ఏరియాకు సంస్థ 12,11,640 టన్నుల లక్ష్యం నిర్దేశించగా, 11,38,686 టన్నుల ఉత్పత్తి సాధించి అగ్రస్థానాన నిలిచింది. ఇక మణుగూరు ఏరియా 8,81,820 టన్నుల లక్ష్యానికి 9,17,678 టన్నులతో 104శాతం ఉత్పత్తి సాధించడం విశేషం.


