వడదెబ్బతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

Apr 30 2026 7:49 AM | Updated on Apr 30 2026 7:49 AM

ఇల్లెందు: పట్టణంలోని కొత్త కాలనీ 13వ వార్డులో ఓ వ్యక్తి బుధవారం వడదెబ్బతో మృతి చెందాడు. కొత్త కాలనీకి చెందిన పడగాల కృష్ణారావు(55) ఎప్పటిలాగే మంగళవారం కూడా కూలి పనికి వెళ్లగా వడదెబ్బకు గురయ్యాడు. దీంతో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దహన సంస్కారాల కోసం 13వ వార్డు కౌన్సిలర్‌ దండు సారయ్య(సారిక) రూ.10 వేల ఆర్థికసాయం అందించారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి..

నాలుగుకు చేరిన ప్రమాద మృతుల సంఖ్య

అశ్వారావుపేటరూరల్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం మృతి చెందాడు. దీంతో లారీ ఢీ కొన్న రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఎస్‌ఐ టీ యయాతీ రాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేట పట్టణంలోని సత్తుపల్లి రోడ్‌లో ఉన్న రైతు వేదిక వద్ద ఈ నెల 16న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో అదే రోజున ముగ్గురు దుర్మరణం చెందారు. గాయపడిన అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన సోయం రమేష్‌(40) ఏపీలోని ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

డివైడర్‌ను ఢీకొట్టిన కారు

ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

అశ్వాపురం: మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఏటూరునాగారానికి చెందిన తిరుమలశెట్టి వీర్రాజు(50) కుటుంబీకులతో కలిసి బుధవారం రాత్రి కారులో ఏపీ రాష్ట్రం బాపట్ల జిల్లా నిజాపట్నం మండలం కొత్తపాలెం గ్రామంలో వివాహా వేడుకలకు బయల్దేరారు. ఈ క్రమంలో అశ్వాపురంలో ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌ సమీపంలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వీర్రాజు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు భార్య లక్ష్మి, కుమారుడు దుర్గాప్రసాద్‌, కోడలు నవ్య, మనమడు సహర్ష్‌, మరదలు కుమారుడు చింతలపూడి పృథ్వీరాజ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ అశోక్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎస్సై రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్యను హతమార్చిన కేసులో

భర్త అరెస్ట్‌

చండ్రుగొండ : భార్యను హతమార్చిన కేసులో భర్తను అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ శివరామకృష్ణ బుధవారం రాత్రి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. చండ్రుగొండ శివారు అయన్నపాలెం గ్రామానికి చెందిన బొప్పి నాగరాజు మద్యం మత్తులో ఈ నెల 21న భార్య పున్వేశ్వరితో ఘర్షణ పడి, కత్తితో గాయపర్చాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె 25న మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నాగరాజును బుధవారం అరెస్టు చేసి కోర్టులో రిమాండ్‌ చేశారు.

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

బూర్గంపాడు: కిన్నెరసాని నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. బుడ్డగూడెం, పినపాక పట్టీనగర్‌, ఉప్పుసాక ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మేడా ప్రసాద్‌ తెలిపారు. ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించి బాధ్యులపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.

పొట్టకూటి కోసం వచ్చి.. ప్రాణం కోల్పోయి..

కరకగూడెం: పొట్టకూటి కోసం వలస వచ్చి డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ములుగు జిల్లా మంగపేట మండలం పూరేడుపల్లి గ్రామానికి చెందిన మహ్మద్‌ ఖదీర్‌ (37) ఐదేళ్ల క్రితం కరకగూడెం మండలంలోని భట్టుపల్లి గ్రామానికి వలస వచ్చి బొలెరో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 25న బంధువులను ద్విచక్ర వాహనంపై ములుగు ఆస్పత్రికి తీసుకెళ్లి వస్తుండగా పస్రా పెట్రోల్‌ బంకు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement