సీజీఎల్‌ ర్యాంకర్‌కు సన్మానం | - | Sakshi
Sakshi News home page

సీజీఎల్‌ ర్యాంకర్‌కు సన్మానం

Apr 30 2026 7:49 AM | Updated on Apr 30 2026 7:49 AM

ఇల్లెందురూరల్‌: మండలంలోని సుభాష్‌నగర్‌ గ్రామపంచాయతీ లలితాపురానికి చెందిన జక్కుల ప్రణయ్‌ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఎస్‌ఎస్‌సీ సిజీఎల్‌ పోటీ పరీక్షలో జాతీయ స్థాయిలో 102వ ర్యాంకు సాదించాడు. ప్రస్తుతం మాధాపూర్‌లోని బీడీఎల్‌లో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న అతను ఉన్నత ఉద్యోగం లక్ష్యంగా ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ పోటీ పరీక్ష జాతీయస్థాయిలో ప్రతిభ చూపి కస్టమ్స్‌ అధికారిగా ఉద్యోగం సొంతం చేసుకున్నాడు. మరో రెండు రోజుల్లో విధుల్లో చేరనుండగా, బుధవారం మున్నూరుకాపు సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పింగళి నరేష్‌, రాకం శ్యాంబాబు, సత్యనారాయణ, ఎట్టి ప్రసాద్‌, పగడాల చందు, ఆకుల చందర్‌, అనిల్‌, రాహుల్‌, గౌతమ్‌ పాల్గొన్నారు.

పట్టువస్త్రాలు

సమర్పించిన జడ్జి

జూలూరుపాడు: మండలంలోని కాకర్ల శ్రీరుక్మిణి సహిత సంతాన వేణుగోపాలస్వామిని బుధవారం కొత్తగూడెం కోర్టు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి బిరుదురాజు సుచరిత దంపతులు దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు జడ్జి సుచరిత దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.

సింగరేణి స్థలానికి ఫెన్సింగ్‌

రుద్రంపూర్‌: చాతకొండ పరిధిలోని సర్వే నంబర్‌ 83 నుండి 93 వరకు గల 44 ఎకరాల 29 కుంటల స్థలాన్ని కొందరు ఆక్రమించగా, యాజమాన్యం స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్‌ వేస్తోంది. గతవారం సిబ్బంది సర్వేకు వెళ్లగా కొంత గడువు కావాలని ఆక్రమించిన వ్యక్తులు కోరారు. ఈ క్రమంలో బుధవారం స్థలంలో ఉన్న హద్దులు, పొలం గట్లను కొత్తగూడెం ఏరియా సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది తొలగించి చుట్టూ ఫెన్సింగ్‌ వేసే పనులు చేపట్టారు. కాగా స్థలం విలువ రూ. సుమారు 44 కోట్లు ఉంటుందని సింగరేణి అధికారులు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును

విజయవంతం చేయాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో త్వరలో జరిగే బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

5న నిరాహార దీక్ష

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం మే 5న కలెక్టరేట్‌ ధర్నాచౌక్‌లో సామూహిక నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు చైర్మన్‌ అమరనేని రామారావు, జేఏసీ కన్వీనర్‌ సంగెం వెంకట పుల్లయ్య తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ జూన్‌ రెండో తేదీ నుంచి అమలు చేయాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని, ఐదు డీఏలను విడుదల చేయాలని కోరారు. సభ్య సంఘాల నాయకులు బి రాజు, ఎం వెంకటేశ్వర్లు, నరసయ్య, బి వెంకటేశ్వరరావు. బి రవి, సంగమేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, పుల్లయ్య, మహేష్‌, శ్రీనివాస్‌, రామ్‌ రవి, నాగేశ్వరరావు, శ్రీనివాస్‌, బాలకృష్ణ, లాల్‌ మొహమ్మద్‌ పాల్గొన్నారు.

‘మాకు న్యాయం చేయాలి’

మణుగూరు రూరల్‌ : బస్సు ప్రమాదంలో గాయపడిన తమ బిడ్డకు న్యాయం చేయాలని విద్యార్థిని తల్లిదండ్రులు విమల–రవీందర్‌ దంపతులు విజ్ఞప్తి చేశారు. మణుగూరులో బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కేఎల్‌ఆర్‌ కాలేజీలో డిప్లొమా చదువుతున్న తమ కుమార్తె పేరుబోయిన స్వర్ణాంబిక మొండికుంట సమీపంలో జరిగిన కళాశాల బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిందని తెలిపారు. ప్రమాదంపై కేసు పెట్టొద్దని, విద్య,వైద్యం పూర్తిగా బాధ్యత వహిస్తామని కళాశాల నిర్వాహకులు హామీ ఇచ్చి, నెరవేర్చకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. ఐదు శస్త్ర చికిత్సలు జరగగా, తామే ఖర్చు భరించామని తెలిపారు. ఆన్‌లైన్‌ క్లాసుల్లో తరగతులు విన్నా కనీసం పరీక్ష రాయడానికి కూడా అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలకు వెళ్లి ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

నవవధువు అదృశ్యం

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలంలో వైద్యం కోసం వచ్చిన ఓ నవవధువు అదృశ్యం కాగా, బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని ఎటపాక మండలం రామగోపాలం తండాకు చెందిన బానోత్‌ నాగమణికి ఈ నెల 1న జూలూరుపాడు వెంగన్నపాలేనికి చెందిన వంశీతో వివాహం జరిగింది. కాగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నాగమణిని బంధువు బానోత్‌ చాందిని ఈ నెల 27న భద్రాచలం తీసుకురాగా, 28న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులకు చూపించారు. ఆ సమయంలో ఆమె అదృశ్యమైంది. బంధువు చాందిని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement