భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం స్వామివారికి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
రామయ్య సేవలో కర్ణాటక మంత్రి
భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్ర స్వామివారిని కర్ణాటక రాష్ట్ర గనుల శాఖ మంత్రి మల్లికార్జున్ బుధవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మల్లికార్జున్‌కు వేదాశీర్వచనం అందజేయగా, అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందించారు. దేవస్థానం పీఆర్వో సాయిబాబు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.


