సీతారామలో రిజర్వాయర్లు! | - | Sakshi
Sakshi News home page

సీతారామలో రిజర్వాయర్లు!

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

190 కి.మీ. నిడివితో

ప్రధాన కాల్వ

ప్రభుత్వ సూచనలతో ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా సర్వే ఇప్పటికే అధికారులకు సానుకూల సంకేతాలు తక్కువ భూసేకరణ, ఎక్కువ సామర్ధ్యంతో నిర్మించేలా ప్రతిపాదనలు

ఖమ్మంఅర్బన్‌: ఉమ్మడి జిల్లా సాగు అవసరాల కోసం గోదావరి జలాల ఆధారంగా నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అప్పటికప్పుడు వరద పారించడమే కాక సీజన్‌లో సముద్రంలో వృథాగా కలిగే నీటిని ఒడిసి పట్టేలా బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు నిర్మించాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. తక్కువ భూమి వినియోగంతో ఎక్కువ నీటి నిల్వ సామర్ధ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వం సూచనలు చేయగా ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా సర్వే కూడా పూర్తిచేయించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.

సాగు, తాగు అవసరాలకు..

నాగార్జునసాగర్‌, కాళేశ్వరం, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ల పరిధిలో కాల్వల ద్వారా నీరు పారిస్తూ నిల్వల కోసం రిజర్వాయర్లు నిర్మించారు. సాగర్‌ ఎడమ కాల్వపై 40 కిలోమీటర్‌ వద్ద పెద్ద దేవులపల్లిలో, 70వ కి.మీ.వద్ద పునుగోడులో, 136 కి.మీ.వద్ద పాలేరులో రిజర్వాయర్లు ఉన్నాయి. అంతేకాక 220 కిలో మీటర్‌ వద్ద వైరాలో, 270 కి.మీ. వద్ద లంకా సాగర్‌ రిజర్వాయర్‌తో అటు సాగు, తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఇదే తరహాలో సీతారామ ప్రాజెక్ట్‌ పరిధి లోనూ రిజర్వాయర్లు నిర్మిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడతాయనే భావనకు వచ్చినట్లు సమాచారం.

ములకలపల్లిలో ఒకటి?

ఖమ్మం జిల్లా పరిధిలో సుమారు 80 కి.మీ. మేర సీతారామ కాల్వ నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులను 13, 14, 15, 16వ ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో ఎక్కడ రిజర్వాయర్‌ నిర్మిస్తే ఎక్కువ మేలు జరుగుతుందో నిర్ధారించేందుకు ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా సర్వే చేయించినట్లు తెలిసింది. ఈమేరకు 15వ ప్యాకేజీ పరిధిలో గుట్టల మధ్య ఒక రిజర్వాయర్‌ నిర్మాణానికి అనువుగా ఉందని ప్రాథమికంగా గుర్తించారని సమాచారం. ఈ ప్రాంతం మహబూబాబాద్‌ జిల్లా ములకలపల్లి పరిధిలోకి వస్తుండగా.. సుమారు 20 – 25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించే అవకాశముందని తెలిసింది. ఇందుకోసం 2,500 నుంచి 3 వేల ఎకరాల భూమి అవసరం కాగా, సగం మేర ప్రభుత్వ భూమి పోను మిగతాది సేకరించాల్సి వస్తుందని నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో ముంపు సమస్య కూడా రాదని చెబుతున్నారు. నిర్మాణ వ్యయం రూ.7వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లుగా అంచనా వేయగా... సుమారు రూ.4,500 కోట్లు నిర్మాణ పనులకు, మిగతాది భూసేకరణ తదితర ఖర్చులకు అవసరమవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్లు చెబుతున్నారు. ఇదేకాక మరో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు ఉన్నాయని సమాచారం.

అవసరాలకు భరోసా

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్‌, రబీ పంటలకు కలిపి సుమారు 60 టీఎంసీల నీరు అవసరమవుతోంది. అంతేకాక తాగునీటి అవసరాలకు మరో ఆరు టీఎంసీలు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్‌ సామర్థ్యం 2.5 టీఎంసీలే కావడంతో వర్షాభావ పరిస్థితులు ఎదురైతే సమస్యలు వస్తున్నాయి. ఈనేపథ్యాన సీతారామలో రిజర్వాయర్లు నిర్మిస్తే అటు సాగునీరు, ఇటు తాగునీటి అవసరాలకు స్థిరమైన భరోసా ఏర్పడనుంది. అంతేకాక కృష్ణా బేసిన్‌లో నీటి కొరత ఏర్పడినప్పుడు గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. అలాగే, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు తాగునీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన జల వనరుల శాఖ ఇంజనీర్ల సమావేశంలోనూ రిజర్వాయర్ల అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. భూసేకరణ, సాంకేతిక అంశాలు, వ్యయంపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిసింది.

ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ పొడవు సుమారు 190 కి.మీ.గా ఉన్నా నిర్మాణంలో ఎక్కడా రిజర్వాయర్లను ప్రతిపాదించలేదు. దీంతో గోదావరికి వరద వచ్చినప్పుడు మాత్రం ఆయకట్టుకు నీరు విడుదల చేయనుండగా.. నిల్వలకు అవకాశం లేదు. ఈనేపథ్యాన సముద్రంలో కలిసే నీటిని ఒడిసిపట్టేలా కాల్వల మధ్య రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వ సూచనలతో జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. తద్వారా సీతారామ ప్రాజెక్టు నీరే కాక వర్షాలతో వచ్చే వరద కూడా నిల్వ ఉంటుందని చెబుతున్నారు.

20 టీఎంసీలతో ఒకటి ఖరారు ?

Advertisement
 
Advertisement
Advertisement